SIT Investigation In TSPSC Paper Leakage Case: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో.. సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. విచారణలో భాగంగా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు.. మరోసారి విచారించి మరిన్ని వివరాలు రాబట్టారు. 100పైగా మార్కులు వచ్చిన అభ్యర్థుల నుంచి పూర్తివివరాలు సేకరించిన అధికారులు.. అవసరమైతే మరోసారి రావాలని సూచించారు.
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో సిట్ అధికారులు.. దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. కేసుకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం 12 మంది అరెస్టు కాగా.. వారిలో 9 మందిని ఇటీవల 6 రోజుల కస్టడీకి తీసుకుని ప్రశ్నించిన సిట్.. విచారణలో కీలక వివరాలు రాబట్టారు. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌లో ఉన్న ప్రధాన నిందితుడు ప్రవీణ్ కుమార్, రాజశేఖర్‌రెడ్డి, డాక్యానాయక్, రాజేందర్‌నాయక్‌ను మరోసారి కస్టడీలోకి తీసుకున్నారు.
చంచల్‌గూడ జైలు నుంచి నిందితులను.. నేరుగా సిట్ కార్యాలయానికి తరలించారు. అనంతరం వారిని కింగ్‌కోఠి ఆస్పత్రికి తరలించి వైద్యపరీక్షలు నిర్వహించారు. విచారణలో తన భర్తను తీవ్రంగా హింసిస్తున్నారంటూ రాజశేఖర్‌రెడ్డి భార్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ కేసు విచారణలో భాగంగా నిందితులకు 48 గంటలకు ఒకసారి వైద్యపరీక్షలు నిర్వహించాలన్న హైకోర్టు సూచన మేరకు.. కోఠి ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. అనంతరం మళ్లీ సిట్ కార్యాలయానికి తరలించి విచారించారు. మరో రెండురోజులపాటు నలుగురు నిందితులను అధికారులు వివిధకోణాల్లో ప్రశ్నించనున్నారు.
TSPSC Paper Leakage Case Update: గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో అధికమార్కులు వచ్చిన వారిపైనా సిట్ అధికారులు దృష్టిసారించారు. టీఎస్పీఎస్సీ నుంచి 100కు పైగా మార్కులు వచ్చిన వారి వివరాలు సేకరించిన అధికారులు.. ఆ అభ్యర్థులతో ఒక జాబితా తయారు చేశారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ అర్హత పొందిన అభ్యర్థులకు ఫోన్లుచేసి.. వారి వివరాలు సేకరించారు. మరికొందరిని సిట్ కార్యాలయానికి రావాలని సూచించారు. వచ్చిన దాదాపు 20మంది అభ్యర్థుల విద్యార్హతలు, ప్రస్తుత ఉద్యోగం సహా గత పోటీపరీక్షల్లో వచ్చిన మార్కులపై ఆరా తీశారు. అవసరమైతే మరోసారి పిలుస్తామని పోలీసులు చెప్పినట్లు అభ్యర్థులు వెల్లడించారు. ఈ విధంగా ప్రశ్నించడం మంచి పద్ధతినే అంటూ అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేశారు.
లీకైన ప్రశ్నపత్రాలతో పరీక్షరాసి 100కుపైగా మార్కులు సాధించిన రమేశ్‌కుమార్, షమీమ్, సురేశ్‌ను ఇప్పిటికే సిట్ అధికారులు అరెస్టు చేశారు. వారిని 7 రోజుల కస్టడీకి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది.
ఇవీ చదవండి: