Data Theft Case Update: దేశవ్యాప్తంగా కలకలం రేపిన డేటా చోరీ కేసు సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. డేటా చోరీ అయిన పలు సంస్థలకు నోటీసులు జారీ చేసిన సిట్ బృందం.. ఆయా సంస్థల ప్రతినిధుల నుంచి వివరణ తీసుకుంటోంది. ఎంతో భద్రంగా ఉండాల్సిన పౌరుల వ్యక్తిగత డేటా ఏ విధంగా చౌర్యం అయింది..? ఇంటి దొంగలే ఈ వ్యవహారానికి కారణమా..? ఎంతమందితో కుమ్మక్కై డేటా తస్కరించారు? ఆయా సంస్థలు డేటా భద్రత వ్యవహారంలో ఎటువంటి చర్యలు చేపడుతున్నాయి? తదితర అంశాలపై విచారణకు హాజరైన సంస్థల ప్రతినిధుల నుంచి సిట్ వివరాలు సేకరించింది.
డేటా లీక్ వ్యవహారంలో మరో వ్యక్తికి సిట్ నోటీసులు: మరోవైపు 20 వెబ్ సైట్ల నుంచి కూడా డేటా లీక్ అయినట్లు గుర్తించిన సిట్.. ఆయా వెబ్ సైట్లకు నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకు 8 సంస్థల ప్రతినిధుల నుంచి వివరాలు సేకరించిన పోలీసులు.. మరి కొంతమంది నుంచి కూడా వివరాలు రాబట్టనున్నారు. మరోవైపు డేటా లీక్ వ్యవహారంలో మరో వ్యక్తికి సిట్ నోటీసులు జారీ చేసింది.
భరద్వాజుకు ఎవరు సహకరించారు?: ఈ కేసులో ప్రధాన నిందితుడు వినయ్ భరద్వాజ్‌ను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని లోతుగా విచారిస్తే మరిన్ని అంశాలు బయటపడే అవకాశం ఉందని సిట్ భావిస్తుంది. డేటా చోరీ కేసులో ప్రధాన నిందితుడికి ఎవరెవరు సహకరించారు..? ఏ విధంగా అతను డేటా తస్కరించాడు..? అనే అంశాలపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. హరియాణాలోని ఫరీదాబాద్ కేంద్రంగా ఈ డేటా చోరీ జరిగినట్టు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. నిందితుడు భరద్వాజ్‌కు అమీర్ సోహైల్‌తో పాటు మదన్ గోపాల్ అనే వ్యక్తులు సహకరించినట్టు దర్యాప్తులో తేలింది.
పలువురు విద్యార్థులు, క్యాబ్ డ్రైవర్లు, గుజారాత్ రాష్ట్రంలోని వివిధ సంస్థల్లో పనిచేస్తూ.. వేతనాలు పొందుతున్న 4.5 లక్షల మంది, ఆర్టీఓ, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, పేటీఎం, ఫోన్‌పే, బుగ్ మై షో, బిగ్ బాస్కెట్, అమెజాన్, జీఎస్టీ, జొమాటో, పాలసీ బజార్ తదితర సంస్థల నుంచి నిందితుడు డేటా చోరీ చేసినట్టు పోలీసులు విచారణలో బయటపడింది. డేటా చోరీ చేసిన మెత్తాన్ని 104 కేటగిరీలుగా విభజించి విక్రయించినట్టు గుర్తించారు.
ఇవీ చదవండి: