MLAs Poaching Case Update : 'ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో సిట్ ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. దర్యాప్తు పురోగతిని ఈ నెల 29న న్యాయస్థానానికి నివేదించాల్సి ఉండటంతో కీలక ఆధారాల్ని సేకరించే పనిలో నిమగ్నమైంది. ఈ కేసులో నిందితులుగా చేర్చిన భాజపా కీలకనేత బీఎల్. సంతోష్‌తోపాటు జగ్గుస్వామి, తుషార్ వెల్లాపల్లి, కరీంనగర్ న్యాయవాది బూసారపు శ్రీనివాస్ పాత్రను నిగ్గు తేల్చడంపై కసరత్తు చేస్తోంది. వీరిలో శ్రీనివాస్ ఒక్కరే ఇప్పటివరకు సిట్ విచారణకు హాజరయ్యారు.
బీఎల్.సంతోష్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసి ఊరట పొందారు. మిగిలిన ఇద్దరూ స్పందించకపోవడంతో సిట్ వీరిపై లుక్‌అవుట్ సర్క్యులర్ జారీ చేసింది. వీరిద్దరూ పొరుగు రాష్ట్రాల్లో తలదాచుకున్నట్లు సిట్ భావిస్తోంది. వాస్తవానికి జగ్గుస్వామి సిట్ బృందం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. నోటీసు ఇచ్చేందుకు సిట్ సభ్యురాలైన నల్గొండ ఎస్పీ రెమా రాజేశ్వరి బృందం కొచ్చిలోని అమృత ఆసుపత్రికి వెళ్లిన సమయంలో అతడు ఆసుపత్రి క్వార్టర్‌లోనే ఉన్నట్లు వెల్లడైంది.
పోలీసులు వచ్చారన్న సమాచారం తెలిసి.. అతడు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సిట్ గుర్తించింది. 41ఏ-సీఆర్పీసీ నోటీసును నేరుగా అందుకున్నవారు తప్పనిసరిగా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. లేకపోతే పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంటుంది. ఈ కారణంగానే అనుమానితులు నోటీసులు అందుకోకుండా తప్పించుకుంటున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఈ వ్యవహారంలో కీలక పెద్దలున్నారని.. వారికి, నిందితులకు మధ్య తుషార్, జగ్గుస్వామి అనుసంధానకర్తలుగా ఉన్నారని సిట్ విశ్వసిస్తోంది. నిందితుడు రామచంద్ర భారతిని తుషార్‌తో కలిపించింది జగ్గుస్వామి అని సిట్ అనుమానం. ఫామ్‌హౌస్‌లో ఉండగా, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని రామచంద్ర భారతి.. తుషార్‌తో మాట్లాడించారు.
తుషార్, జగ్గుస్వామిలను విచారిస్తే.. కీలక సమాచారం, ఆధారాలు లభ్యమవుతాయని అధికారులు భావిస్తున్నారు. అనుమానితుల విచారణలో భాగంగా అంబర్‌పేటకు చెందిన న్యాయవాది పోగులకొండ ప్రతాప్ గౌడ్‌ను రెండో రోజు సిట్ బృందం దాదాపు ఎనిమిది గంటలపాటు విచారించింది. నిందితులతో అతడికున్న ఆర్థిక లావాదేవీల విషయంలోనే ప్రశ్నించినట్లు తెలిసింది.
ఇవీ చదవండి: