TSPSC Paper Leakage Case Latest Updates : టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ముగ్గురు నిందితులను సిట్ అధికారులు విచారిస్తున్నారు. సుచరిత, శాంతి, రాహుల్‌లను మూడు రోజుల కస్టడీలో భాగంగా.. వారిని చంచల్‌గూడ జైలు నుంచి సిట్ కార్యాలయానికి తరలించారు. ఈ క్రమంలోనే నిందితులను ప్రశ్నించి కీలక సమాచారం సేకరిస్తున్నారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగి రాజశేఖర్‌రెడ్డి భార్య సుచరిత, ఏఈ ప్రశ్నాపత్రం కేసులో నిందితుడిగా ఉన్న రాజేశ్వర్ నాయక్ భార్య శాంతి, డివిజినల్ అకౌంట్స్ అధికారి పరీక్ష రాసినట్లు సిట్ అధికారుల దర్యాప్తులో తేలింది.
నిందితులతో ఉన్న సంబంధాలపై దృష్టి : టీఎస్‌పీఎస్సీ అధికారులు డీఏఓ పరీక్ష జవాబు పత్రాలను మదింపు చేసి.. అధిక మార్కులు సాధించిన వాళ్ల జాబితాను సిట్‌కు ఇచ్చారు. ఈ క్రమంలోనే సిట్ అధికారులు ఆయా అభ్యర్థుల పూర్తి వివరాలు సేకరించి.. నిందితులతో ఉన్న సంబంధాలపై దృష్టి పెట్టారు. దీంతో సుచరిత, శాంతిలు సైతం.. ప్రశ్నాపత్రం తీసుకొని పరీక్ష రాసి అధిక మార్కులు పొందినట్లు దర్యాప్తులో తేలింది.
39 మంది అరెస్ట్ : ప్రశ్నాపత్రం ఎప్పుడు చేతికి అందింది, ఎక్కడ చదివారు.. ఇంకెవరికైనా ప్రశ్నలను చెప్పారా అనే కోణంలో సిట్ అధికారులు నిందితులను ప్రశ్నిస్తున్నారు. రాహుల్ సైతం ప్రశ్నాపత్రాలను విక్రయించినట్లు గుర్తించారు. దానిని ఎవరెవరికి విక్రయించి ఎంత సొమ్ము చేసుకున్నాడనే వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో ఇప్పటి వరకు 39మందిని అరెస్ట్ చేశారు.
మరోవైపు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని రోజుల తరబడి ప్రశ్నించిన సిట్ అధికారులు.. వారి వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరో కష్టసాధ్యమైన పనికి వారు సిద్ధమయ్యారు. గ్రూప్1, ఏఈ, ఏఈఈ, డీఏవో తదితర పరీక్షలు రాసిన అభ్యర్థుల జవాబు పత్రాలను పరిశీలించాని నిర్ణయించారు. ఒక్కో అభ్యర్థికి వచ్చిన మార్కులు ఆధారంగా లిస్ట్‌ను తయారు చేసుకున్నారు. వారిలో ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థుల వివరాలను వేరు చేశారు.
అసలు నిందితుల గుర్తింపు : అందుకు ఎక్కువ మార్కులు తెచ్చుకున్న అభ్యర్థుల ఫోన్ నంబర్లను గుర్తించి.. విచారించే పనిలో పడ్డారు. వారి బ్యాంకు ఖాతాలను సైతం పరిశీలించారు. ఈ క్రమంలోనే ఆ అభ్యర్థుల ప్రతిభ, సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు.. సిట్ అధికారులు కొన్ని ప్రశ్నావళిని రూపొందించి సమాధానాలు రాబట్టారు. వాటిని అంచనా వేసి అసలు నిందితులను గుర్తించారు. ఈ ఏడాది మార్చిలో ఏడు, ఎనిమిది తేెదీల్లో టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాలు లీకైనట్లు వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి దీనిపై సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: TSPSC PAPER LEAK UPDATE: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల కేసులో మరో ముగ్గురు అరెస్టు
Governor Tamilsai interesting comments : 'నూతన సచివాలయం అద్భుతం.. కానీ ఆహ్వాన పత్రికైనా పంపలేదు'
కొత్త పార్లమెంట్ ఓపెనింగ్‌పై సుప్రీంకోర్టులో కేసు.. విమర్శల దాడి పెంచిన కాంగ్రెస్