Huge Loss to Singareni : నాలుగు బొగ్గు బ్లాకులను ప్రైవేటుపరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు చేపట్టిన మూడు రోజుల సమ్మె ముగిసింది. తమ డిమాండ్ల కోసం నిరసన తెలుపుతూ కార్మికులు 72 గంటల పాటు స్వచ్ఛందంగా విధులు బహిష్కరించారు. కార్మికుల మూడు రోజుల సమ్మెతో సుమారు నాలుగు లక్షల టన్నులకుపైగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో సింగరేణి సంస్థ రూ.120 కోట్లకుపైగా రాబడిని కోల్పోయింది.
Singareni Workers Strike : ఉత్పత్తి లక్ష్య సాధనలో గత రెండేళ్ల(2019-21)లో సంస్థ పనితీరు నిరాశాజనకంగానే ఉంది. గతేడాది కరోనా, లాక్‌డౌన్‌ల కారణంగా ఐదు కోట్ల టన్నుల ఉత్పత్తే సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021-22)లో 6.80 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలనే లక్ష్యాన్ని సంస్థ నిర్దేశించుకున్నప్పటికీ, ఇప్పటివరకూ అంతకన్నా 6 శాతం తక్కువగానే తవ్వింది. లక్ష్యాన్ని చేరుకోవాలంటే మార్చి 31 వరకు రోజుకు సరాసరిన 2.10 లక్షల టన్నులు బయటికి తీయాల్సి ఉంటుంది. ప్రస్తుతం రోజుకు 50 వేల టన్నులు తక్కువగా తవ్వుతున్నారు.
దిద్దుబాటు చర్యలు
Strike Causes Loss to Singareni : గత మూడు రోజులుగా ఉత్పత్తి తగ్గిన నేపథ్యంలో సంస్థ దిద్దుబాటు చర్యలు ఆరంభించింది. నిబంధనలు సడలించి ఆదివారం(ఈ నెల 12న) కార్మికులతో అదనంగా పనిచేయించాలని నిర్ణయం తీసుకుంది. సాధారణంగా వారంలో కనీసం నాలుగు రోజులు పనిచేసిన కార్మికులనే ఆదివారం పనిచేయడానికి అనుమతించాలనే నిబంధన ఉంది. సమ్మె కారణంగా నిబంధనను సడలించామని, వారంలో కనీసం రెండు రోజులు పనిచేసిన వారిని కూడా ఆదివారం విధులకు వచ్చేలా అనుమతించామని సంస్థ అధికారులు చెప్పారు.
విద్యుత్ కేంద్రాలపై ప్రభావం
Singareni Samme 2021 : సింగరేణి గనుల నుంచి తెలంగాణతోపాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర విద్యుత్ కేంద్రాలకు బొగ్గు రవాణా అవుతుంది. మూడు రోజుల సమ్మెతో రవాణా నిలిచిపోవడంతో కేంద్రం ఆరా తీసింది. విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు ఎన్ని ఉన్నాయి? సమ్మె వల్ల ఎంత కొరత ఏర్పడింది?.. తదితరాలను అంచనా వేసింది. ఈ నెల 9 నాటికి విజయవాడ, రాయలసీమ థర్మల్ కేంద్రాలలో మూడు రోజులకు, కృష్ణపట్నం ప్లాంటులో ఒకరోజుకు సరిపోయే బొగ్గు మాత్రమే ఉన్నట్లు కేంద్ర విద్యుత్‌శాఖ తాజా నివేదికలో వెల్లడించింది. సమ్మెవల్ల ఏర్పడిన లోటు పూడ్చటానికి రాబోయే వారం రోజుల్లో అదనంగా బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయాలని సూచించింది.
సింగరేణిలో మూడు రోజుల సమ్మె సంపూర్ణం
Singareni Workers Samme : సింగరేణిలో కార్మిక సంఘాల ఐకాస పిలుపుమేరకు మూడు రోజుల సమ్మె విజయవంతమైంది. తెరాస అనుబంధ తెబొగకాసం, జాతీయ కార్మిక సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్చెమ్మెస్, బీఎంఎస్, సీఐటీయూలతో కూడిన ఐకాస 12 డిమాండ్లతో ఇచ్చిన నోటీసుపై ఎలాంటి పురోగతి లేకపోవడంతో కార్మికులు సమ్మెకు దిగారు. విప్లవ కార్మిక సంఘాలు సైతం మద్దతు ప్రకటించడంతో గతంలో ఎన్నడూలేని విధంగా కార్మిక వర్గం పూర్తిస్థాయిలో సమ్మెలో పాల్గొంది. విద్యుత్తు కేంద్రాలకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని అధికారులు పాక్షికంగా బొగ్గు ఉత్పత్తి చేయడానికి ప్రయత్నించినప్పటికీ పనిచేయడానికి ముందుకు వచ్చే కార్మికులు లేకపోవడంతో సమ్మె సంపూర్ణంగా జరిగింది. ఆరు జిల్లాల్లోని 25 భూగర్భ, 20 ఉపరితల గనుల్లో సమ్మె ప్రశాంతంగా జరిగింది.
రైతుల ఉద్యమం స్ఫూర్తిగా..
కార్మిక సంఘాల ఐకాస ఇచ్చిన 12 డిమాండ్లలో సింగరేణి పరిధిలో 11 ఉన్నాయని, వాటిపై యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి స్పందించకుంటే జనవరి 20 తర్వాత అన్ని సంఘాలు కలిసి నిరవధిక సమ్మె చేస్తామని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య స్పష్టం చేశారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని సింగరేణి కార్మికవర్గం బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని హెచ్చెమ్మెస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ అన్నారు.
ఇదీ చూడండి: Singareni Trade unions strike: సింగరేణిలో మూడో రోజు కొనసాగుతున్న కార్మికుల సమ్మె