సింగరేణి సీఎండీ శ్రీధర్ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య ప్రసాద్ పాథినిను కలిశారు. ఆ రాష్ట్రంలో నైనీ బొగ్గు గని తవ్వకానికి భూసేకరణ, అనుమతుల కోసం ఒడిశా ప్రభుత్వ సహకారం కోరారు. ఇందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందించింది. ఈ సందర్భంగా సింగరేణి సీఎండీ శ్రీధర్.. ఫణి తుఫాను బాధిత ఒడిశా రాష్ట్రానికి సహయంగా కోటి రూపాయల చెక్కును ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు అందజేశారు. ఒడిశాలోని నైనీ బ్లాకులో 34కోట్ల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఏడాదికి కోటి టన్నుల బొగ్గు ఉత్పత్తికి సింగరేణి ప్రణాళిక తయారు చేసింది.
2021 నాటికి ఉత్పత్తి
జనరల్ మేనేజర్ విజయరావును ఈ గని వ్యవహారాల పర్యవేక్షణ అధికారిగా నియమించి ప్రతినెలా పురోగతిని సమీక్షిస్తున్నారు. ఆ రాష్ట్ర ఛెండిపడ తహసీల్ పరిధిలో నైనీ బొగ్గు బ్లాకు ప్రభావిత గ్రామాలైన థలీపాసి, కుడాపాసి, కాసిదిహ, దౌరాఖమాన్, భీం భద్రపూర్ టెంటులోయి గోపినాథ్పూర్ గ్రామాల్లో ఇప్పటికే పలు సమాజహిత కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రభుత్వ పరమైన సహకారం, అనుమతులతో పాటు అటవీ పర్యావరణ శాఖ అనుమతులను మార్చి 2020 నాటికి పూర్తి చేసి ఫిబ్రవరి 2021 నాటికి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించాలని సింగరేణి నిర్ణయించింది.
ఇవీ చూడండి: బావిలోకి దిగిన యువకులు ఎలా చనిపోయారు..!