సింగరేణి సంస్థ సీఎండీ శ్రీధర్ సోమవారం నుంచి ఈ నెల 17 వరకు సెలవు పెట్టారు. ఆయన స్థానంలో ప్రభుత్వం ఇంధన శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాకు అదనపు బాధ్యతలు అప్పగించింది. సంక్షోభంలో ఉన్న విద్యుత్కేంద్రాలకు బొగ్గు సరఫరా చేసేందుకు తవ్వకాలు, రవాణా పెంచాలని కేంద్రం బొగ్గు, విద్యుత్ శాఖలు అన్ని రాష్ట్రాలను ఆదేశించాయి. ఈ నేపథ్యంలో సీఎండీ సెలవులో వెళ్లడం చర్చనీయాంశమైంది. అనారోగ్యంతో తెలంగాణ జెన్‌కో సీఎండీ ప్రభాకరరావు (Genco CMD Prabhakar Rao) సెలవులో ఉన్నారు. ఆయన స్థానంలో జెన్‌కో ఇన్‌ఛార్జి సీఎండీగా కొనసాగుతున్న శ్రీధర్.. సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తిని పర్యవేక్షిస్తూ జెన్‌కో థర్మల్ కేంద్రాలకు కూడా బొగ్గు సక్రమంగా రవాణా అయ్యేలా చూడాల్సి ఉంది.
కార్మికులకు ఎక్కువ సెలవులు వద్దు..
సీఎండీ సెలవులో వెళ్లడంతో సింగరేణి సంచాలకులు ఎన్.బలరాం, చంద్రశేఖర్ సోమవారం దృశ్యమాధ్యమం ద్వారా అన్ని గనుల జీఎంలతో మాట్లాడి బొగ్గు ఉత్పత్తి, రవాణా పెంచాలని సూచించారు. దసరా, బతుకమ్మ ఉత్సవాల పేరుతో కార్మికులకు ఎక్కువగా సెలవులు ఇవ్వవద్దని, బొగ్గు తవ్వకాలు పెంచి థర్మల్ విద్యుత్కేంద్రాలకు సరఫరా చేయాలని ఆదేశించారు.
ఇదీ చూడండి: Telangana Singareni : దేశంలో క్రియాశీలకంగా తెలంగాణ.. మన బొగ్గే అన్ని రాష్ట్రాలకూ ఆధారం!
Coal Crisis: విద్యుత్ సంక్షోభం, బొగ్గు కొరతకు ప్రధాన కారణమేంటి? కేంద్రం ఏం చెబుతోంది?