Silkworms Record Price in Telangana: పట్టుగూళ్ల ధరలు రికార్డుస్థాయిలో పెరుగుతున్నాయి. సోమవారం హైదరాబాద్ మార్కెట్‌లో కిలో పట్టుగూళ్లు రూ.752 పలకగా, ఆంధ్రప్రదేశ్‌లోని మడకశిరలో రూ.768, బెంగళూరులో రూ.952 పలికాయి. ఏడాది క్రితం రూ.300 నుంచి రూ.400 లోపు ఉన్న ధర ప్రస్తుతం రెట్టింపు కావడానికి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ పెరగడం కారణంగా తెలుస్తోంది.
Silkworms Record Price: భారతదేశంలో ఏటా 66 వేల టన్నుల పట్టు వినియోస్తుండగా దేశంలో ఉత్పత్తయ్యేది 36,152 టన్నులే ఉంటోంది. గతంలో చైనా నుంచి ఎక్కువగా దిగుమతయ్యేది. కానీ అక్కడ వాతావరణంలో మార్పులు, కూలీల కొరత వంటి సమస్యల వల్ల దిగుమతి పడిపోయింది. దేశంలోనే అత్యధికంగా కర్ణాటకలో ఏటా 11,143.. ఏపీలో 7,962.. తెలంగాణలో 306 టన్నుల పట్టు ఉత్పత్తవుతోంది. ప్రస్తుతం తెలంగాణలో 12,654 వేల ఎకరాల్లో రైతులు మల్బరీ సాగు చేస్తున్నారు. ఈ మొత్తం లక్ష ఎకరాలకు పెంచాల్సిన అవసరం ఉందని ఉద్యానశాఖ ప్రభుత్వానికి నివేదించింది. మల్బరీ సాగును ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేసినందున మూడేళ్లలో రూ.లక్ష వరకూ రాయితీ ఇస్తారు. తొలి ఏడాది రూ.50 వేల వరకూ రైతుకు పెట్టుబడి ఖర్చు వస్తుంది. కిలో పట్టుగూళ్ల ఉత్పత్తి వ్యయం ప్రాంతాన్ని బట్టి రూ.300 నుంచి రూ. 400 దాకా అవుతోందని ఉద్యానశాఖ అధ్యయనంలో గుర్తించారు. ధర పెరిగినందున అన్ని ఖర్చులు పోను ఎకరానికి రూ.లక్షకు పైగా ఆదాయం వస్తుందని అంచనా.
లాభాలు ఖాయం...
ఏడు కిలోల పట్టుగూళ్ల నుంచి కిలో పట్టుదారం వస్తుంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లలో కిలో పట్టుదారం ధర రూ.5 వేలకు పైగా పలుకుతోంది. రైతులు వరికి బదులుగా మల్బరీ సాగు చేస్తే మంచి ఆదాయం వస్తుందని రాష్ట్ర పట్టుపరిశ్రమ శాఖ సంచాలకుడు ఎల్.వెంకట్రాంరెడ్డి తెలిపారు. పట్టుగూళ్ల పెంపకం షెడ్ నిర్మాణానికి కేంద్రం రూ.2 లక్షలు ఇస్తుందని, పంట సాగుకు ఏటా రూ.30 వేల రాయితీ ఇస్తామన్నారు. పట్టుకు ప్రపంచమార్కెట్‌లో ఏడాది పొడవునా డిమాండ్ ఉన్నందున ఆదాయం తగ్గే అవకాశమే లేదన్నారు. ఆసక్తి ఉన్న రైతులు మల్బరీ సాగుతో లాభాలు సాధించవచ్చు. తెలంగాణలో నాణ్యమైన బైవోల్టిన్ రకం పట్టు ఉత్పత్తవుతుందని కేంద్రం గతంలో ప్రశంసించింది. ఈ రకం పట్టుకు మార్కెట్‌లో ఏడాది పొడవునా డిమాండు ఉంటుందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: Silkworms: వరి బదులు పట్టు.. అన్నదాతలకు ఉద్యానశాఖ సలహా