Sidbi Womens stalls hyderabad: (స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) సిడ్బి మహిళలకు నైపుణ్యాలు పెంపొందించేందుకు శిక్షణ ఇస్తూనే మార్కెటింగ్ అవకాశాలను కల్పిస్తోంది. లక్షల రూపాయలు వెచ్చించి అనేక ప్రాంతాల్లో నిర్వహించే ప్రదర్శనల్లో ఉచిత స్టాళ్లు ఏర్పాటు చేస్తోంది. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో అలీప్ ప్రదర్శనలో 14 స్టాళ్ల ఏర్పాటుకు సుమారు 20 లక్షల రూపాయలకు పైగా వెచ్చించింది. 2022లో మొత్తం 19వందల మంది మహిళలకు అండగా నిలిచిన సిడ్బి లెదర్ బ్యాగులు, బయో ఉత్పత్తులు, చేతివృత్తులు తదితర తయారీ యూనిట్లకు సహకరిస్తోంది.
సిడ్బి పరిశీలనలో ఉన్న 150కి పైగా పరిశ్రమలు నెలకొల్పటానికి 10నుంచి 80లక్షల రూపాయల వరకు ఖర్చు చేస్తోంది. పరిశ్రమల స్థాపనకై బ్యాంకు రుణాలు పొందేందుకు అవాంతరాలు ఎదుర్కొంటున్న వారికి సూచనలిస్తోంది. NIRలోని రూరల్ టెక్నాలజీ పార్కు ద్వారా సాంకేతిక అంశాల్లో శిక్షణ ఇస్తుండగా, అమెజాన్ సంస్థ ప్రతినిధులు ఆన్లైన్‌లో విక్రయాల గురించి వివరిస్తున్నారు. నగరాల్లో జరిగే ప్రదర్శనలో ఏర్పాటు చేస్తోన్న స్టాళ్లకు పెద్ద సంఖ్యలో ఆర్డర్లు వస్తున్నాయని సిడ్బి ప్రతినిధులు తెలిపారు
వ్యాపార అభివృద్ధికి బ్యాంక్ అధికారులు ఒక వేదిక ఇచ్చారని స్టాల్స్ నిర్వహిస్తున్న మహిళలు తెలిపారు. వారు తయారు చేసే ఉత్పత్తులతో స్వతహాగా అభివృద్ధి చెందటమే కాకుండా మరికొంత మందికి ఉపాధి అవకాశాలిస్తున్నట్లు మహిళలు వెల్లడించారు. ప్రైవేటు, కార్పొరేటు కంపెనీలలో ఉద్యోగాలు మానేసి వ్యాపారంలో రాణిస్తున్నామని ధీమా వ్యక్తం చేస్తున్నారు
అన్ని రంగాల్లోనూ విజయవంతంగా రాణిస్తున్న మహిళలు వ్యాపార వేత్తలుగా ఎదిగి దేశ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
"సిడ్బి తరపున పది స్టాళ్లను ఏర్పాటుచేశాము. వీటి ద్వారా మహిళ ఔత్సాహికవేత్తలను ప్రోత్సాహించి వారికి మార్కెటింగ్ పరంగా అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యం. వారు తయారుచేసిన వస్తువులను ఈ స్టాళ్లలో అమ్ముకోవచ్చు. వారు ఇతరులతో కూడా వ్యాపారపరంగా నెట్వర్క్ను పెంచుకోవచ్చు." -తోట విద్యాసాగర్, బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్
ఇవీ చదవండి: