హైదరాబాద్‌లోని దూలపల్లిలో ఎనిమిది రోజుల క్రితం ఎస్సైపై దుండగులు దాడి చేసిన ఘటనలో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రుల్లో ఇళ్లు, జ్యూవెలరీ దుకాణాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న దొంగలను బాలానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 22వ తేదీన దుండిగల్ ఎస్సైపై దాడి జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. దీంతో పోలీసులు ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకుని చేధించారు. నిందితుల నుంచి రూ.17 లక్షల విలువైన వాహనాలు స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్‌కు తరలించారు.
ఇదీ జరిగింది...
ఈ నెల 22న అర్ధరాత్రి దూలపల్లి సమీపంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు ఓ అనుమానాస్పద వాహనాన్ని గుర్తించారు. వాహనంలో వ్యక్తులు తలకు ముసుగు ధరించి ఉండడంతో దుండిగల్ ఎస్ఐ శేఖర్ రెడ్డి కారు దిగి వారి దగ్గరికి వెళ్ళే క్రమంలో దుండగులు ఒక్కసారిగా ఎస్ఐ పైకి వాహనాన్ని ఎక్కించే ప్రయత్నం చేసి తప్పించుకున్నారు. పోలీసులు వాహనాన్ని వెంబడించారు. దూలపల్లి అటవీ ప్రాంతంలో కారును చెట్టుకు ఢీ కొట్టి పారిపోయారు. దుండగులు ప్రయాణించిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులు సీసీటీవీ ఫూటేజీ ద్వారా దర్యాప్తు చేసి ఇవాళ ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో తెలంగాణకు చెందిన రంజిత్ సింగ్(19), రణీత్ సింగ్(43), మహారాష్ట్ర వాసి నర్సింగ్ సింగ్(50)గా గుర్తించారు. మరో ముగ్గురు నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.