తెలంగాణ రవాణా శాఖలో స్మార్ట్ కార్డులు నిండుకున్నాయి. మూడు నెలలుగా వాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి స్మార్ట్ కార్డులు జారీ కావడంలేదు. వేలాది మంది ఎదురు చూస్తున్నారు. రిజిస్ట్రేషన్ సందర్భంలో రవాణా శాఖ ఆర్సీని స్మార్ట్ కార్డు రూపంలో జారీ చేస్తుంటుంది. ప్రస్తుతం కార్డులు కొరత కారణంగా వాటి జారీ ఆగిపోయింది. చెల్లింపుల్లో జాప్యం కారణంగా కార్డుల సరఫరాకు గుత్తేదారు చేతులెత్తేయటంతో మరో గుత్తేదారుతో రవాణా శాఖ ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. దీనివల్లనే కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది.
ప్రతి నెలా రాష్ట్రంలో వేల సంఖ్యలో వాహనాల క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. వారికి స్మార్ట్ కార్డుల జారీలో మాత్రం ఇబ్బందులు తప్పడంలేదు. కొత్త వాహనదారులే కాదు.. బ్యాంకు రుణాల ద్వారా వాహనాలు కొనుక్కుని, రుణం తీర్చేసినవారూ కొత్త ఆర్సీ తీసుకోవాల్సి ఉంటుంది. వాహన జీవిత కాలమైన 15 సంవత్సరాలు నిండిపోయిన వాహనదారులు హరిత పన్ను చెల్లించి మరోదఫా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. వారికి కూడా కొత్త ఆర్సీ స్మార్ట్ కార్డులను జారీ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి వారంతా ఇప్పుడు కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు.