రాష్ట్రంలో కరోనా వైరస్ రోజురోజుకూ పేట్రేగిపోతోంది. రోజుకు 4,600-5,000 వరకూ కొత్త కేసులు నమోదవుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ గురువారం(13న) లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 56,917 మంది కొవిడ్‌తో చికిత్స పొందుతున్నారు. ఇందులో 28,583 మంది దవాఖానాల్లో చేరారు. వీరిలో కొందరు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న వారు కూడా ఉంటారని వైద్య వర్గాలు తెలిపాయి. ఆసుపత్రుల్లో చేరిన వారిలో ఆక్సిజన్, ఐసీయూ వెంటిలేటర్ పడకల్లో చికిత్స పొందుతున్నవారు 22,814 (దాదాపు 80 శాతం) మంది ఉన్నారు. ఇది ప్రాణవాయువు అవసరాలు ఏమేరకు ఉన్నాయో తెలియజేస్తోంది. సాధారణ చికిత్స పొందుతున్న వారిలో కొంతమందికి ఉన్నట్టుండి శ్వాస సమస్యలు తలెత్తి ఆక్సిజన్ పడకల అవసరాలు పెరుగుతున్నట్లుగా వైద్యవర్గాలు చెబుతున్నాయి. మొత్తం పడకల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే అత్యధికంగా 25,054 ఉన్నాయి. ఇందులో చేరికలు 17,396గా నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఆసుపత్రుల్లో చేరిన వారిలో 81 శాతానికి పైగా కొవిడ్ బాధితులు ఆక్సిజన్ అవసరమైన వారే.
పడక దొరికితే కరోనాను జయించినంత ఉపశమనంగా...
ఒక్క పడక ఖాళీ అయితే.. అందులో చేరి పోవడానికి కనీసం ఐదుగురు కొవిడ్ బాధితులు సిద్ధంగా ఉంటున్నారని ఒక ఉన్నతాధికారి విశ్లేషించారు. ప్రముఖ ఆసుపత్రుల్లో పడకలు అందుబాటులో లేవనే సమాధానం వస్తుండడంతో కొందరు ముందుగా సమీపంలోని చిన్నాసుపత్రుల్లో చేరుతున్నారు. వైద్యులు సిలిండర్ సాయంతో ఆక్సిజన్ అందజేస్తూ ప్రాథమికంగా అత్యవసర చికిత్స అందజేస్తున్నారు. అత్యధికులు చిన్నాసుపత్రుల్లో చికిత్స పొందుతూనే.. పెద్దాసుపత్రుల్లో పడకల కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అక్కడ రోగులు కోలుకొని ఇంటికి వెళ్లిపోతేనో.. ఎవరైనా చికిత్స పొందుతూ మరణిస్తేనో పడక ఇచ్చే పరిస్థితులుంటున్నాయి. వాటిని శుభ్రపరిచి తిరిగి మరొకరికి కేటాయించడానికి కొంత సమయం పడుతుంది. కొన్నిసార్లు రోగి అత్యవసర పరిస్థితుల్లో ఉంటే ముందుగా అత్యవసర విభాగంలో చేర్చుకొని చికిత్స అందిస్తున్నారు. అక్కడి నుంచి కూడా పడక ఖాళీ ఏర్పడినప్పుడే తరలిస్తున్నారు.
దవాఖానాల వద్ద వరుసల్లో అంబులెన్సులు
సాధారణంగా కొవిడ్ పాజిటివ్‌ల్లో సుమారు 20 శాతం మంది ఆసుపత్రిలో చేరాల్సి ఉంటుంది. అయితే రెండోదశలో వైరస్ తీవ్రత ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఇళ్లలో ఉండి చికిత్సలు పొందుతున్నవారు కూడా ఉన్నట్టుండి అస్వస్థతకు గురవుతున్నారు. బాధితుల్లో ప్రాణవాయువు సమస్యలు తలెత్తుతున్నాయి. రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గిపోవడంతో ఉన్నపళంగా ఆసుపత్రిలో చేర్పించాల్సి వస్తోంది. గచ్చిబౌలిలోని ఒక ఆసుపత్రి వద్ద అయితే.. రోజుకు కనీసం 25-30 అంబులెన్సులు వరుసల్లో నిలబడుతుండడం ఇక్కడి పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. దాదాపు ప్రభుత్వ, ప్రైవేటులోని అన్ని పెద్దాసుపత్రుల్లోనూ ఇంచుమించుగా ఇటువంటి వాతావరణమే కనిపిస్తోంది.
ఇదీ చూడండి: వసతులున్నాయ్.. సిబ్బంది ఏరీ?