మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రం శివనామస్మరణలతో మారుమోగుతుంది. తెల్లవారు జామునుంచే భక్తులు పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. భక్తులు రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్జిత సేవలను ఆలయ అధికారులు రద్దు చేశారు. శివరాత్రి సందర్భంగా రాత్రి 10 గంటలకు లింగోద్భావకాల మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం పాగాలంకరణ, రాత్రి 12 గంటలకు శ్రీ భమరాంబ మల్లిఖార్జున స్వామివార్ల కళ్యాణమహాత్సవం జరగనుంది. తెల్లవారుజామున 4 గంటల నుంచి మల్లికార్జునుడి దర్శనం కోసం క్యూలైన్లలో భక్తులు వేచి చూస్తున్నారు. అధికారులు ఆలయ దక్షిణ ద్వారం నుంచి విఐపీలను పంపుతున్నారు.
దర్శనానికి భక్తుల ఇక్కట్లు...
మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైల బ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులకు ఇక్కట్లు తప్పటం లేదు. వందల కిలోమీటర్లు పాదయాత్రగా వచ్చిన భక్తులు స్వామి దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉండాల్సి వస్తోంది. అర్ధరాత్రి నుంచి క్యూలైన్లలో వేచి ఉన్నా... దర్శన భాగ్యం కలగటం లేదని భక్తులు ఆవేదన చెందుతున్నారు. ఉదయం 6 గంటల తర్వాత వీఐపీలకు అనుమతి లేదని ప్రకటించి మరీ... పంపుతున్నారని ఆరోపించారు. ఇది సాధారణ భక్తులకు ఇబ్బందికరంగా మారిందని వాపోతున్నారు.కంపార్ట్ మెంట్లలో కనీసం తాగునీరు లేకవృద్ధులు, చిన్నారులు అవస్థలు పడుతున్నామని ప్రజలు ఆగ్రహిస్తున్నారు.అక్కడక్కడా తోపులాటలు జరిగినా... స్పందించే నాథుడే కరువయ్యారని భక్తులు ఆవేదన చెందుతున్నారు.