Telangana New Secretariat: రాష్ట్ర నూతన పరిపాలనా సౌధం వచ్చే ఆదివారం ప్రారంభోత్సవం కానుంది. అధునాతనంగా, సువిశాలంగా.. అధికారులు, ఉద్యోగులు మంచి వాతావరణంలో పని చేసేలా కొత్త సచివాలయ భవనాన్ని నిర్మించారు. పనులన్నీ దాదాపుగా పూర్తయి భవనం తుది మెరుగులు దిద్దుకుంటోంది. మిగిలిన అన్ని పనులను ఈ నెల 28వ తేదీ వరకు పూర్తి చేయాలని గడువు నిర్దేశించారు. ఆ తర్వాత భవనాన్ని, ప్రాంగణాన్ని ప్రారంభోత్సవానికి సిద్ధం చేయనున్నారు.
ఆరో అంతస్తులో సీఎం కార్యాలయం: సచివాలయ భవనంలోని అన్ని అంతస్థుల్లో ఫర్నీచర్ ఏర్పాటు పనులు పూర్తి కావస్తున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు కొన్ని అంతస్థుల్లో ఫర్నీచర్ ఏర్పాటు పనులన్నీ ఇప్పటికే పూర్తి కాగా.. మిగతా చోట్ల కొనసాగుతున్నాయి. సోమవారంలోగా ఫర్నీచర్, నెట్ వర్కింగ్ సంబంధిత పనులన్నీ పూర్తవుతాయని అంటున్నారు. అటు సచివాలయ భవనంలో కేటాయింపు ప్రక్రియ దాదాపుగా పూర్తయిందనే చెప్పుకోవచ్చు. మంత్రుల వారీగా కేటాయింపు పూర్తి అయినట్లు సమాచారం. ముఖ్యమంత్రి కార్యాలయం ఆరో అంతస్థులో ఉంటుంది.
ఆయా శాఖలకు సంబంధించి కేటాయింపులు పూర్తి: 16 మంది మంత్రులకు ఒకటి నుంచి ఐదు అంతస్తుల్లోని ఛాంబర్లలో కేటాయించారు. మంత్రులకు అనుగుణంగా ఆయా శాఖలకు సంబంధించిన కార్యదర్శుల కేటాయింపు కసరత్తు కూడా దాదాపుగా పూర్తయినట్లు తెలిసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి శేషాద్రి శనివారం ఇందుకు సంబంధించిన పనులపై కసరత్తు చేశారు. కార్యదర్శులు, అధికారులు, ఆయా విభాగాలకు సంబంధించి కేటాయింపు ప్రక్రియను పూర్తి చేసినట్లు సమాచారం. కొందరు మంత్రులకు ఒకటికి మించి ఎక్కువ శాఖలు ఉన్నాయి. దీంతో సదరు మంత్రికి సంబంధించిన కార్యదర్శులు అందరూ ఒకే చోట ఉండేలా కేటాయింపు కసరత్తు చేసినట్లు సమాచారం. ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేసి సోమవారం సాయంత్రంలోగా ఆదేశాలు జారీ చేస్తారని అంటున్నారు.
ఆ రోజు నుంచి కొత్త సచివాలయం నుంచే కార్యకలాపాలు: ఈలోగా సచివాలయ భవనంలో ఫర్నీచర్, నెట్ వర్కింగ్ సంబంధిత పనులన్నీ ముగించి మంగళవారం నుంచి శాఖల తరలింపును ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఐదు రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని, ప్రారంభోత్సవం నాటికి అంతా సిద్ధం చేయాలని భావిస్తున్నారు. 30వ తేదీన ప్రారంభోత్సవం తర్వాత కొత్త సచివాలయం నుంచే పూర్తి స్థాయి కార్యకలాపాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఇవీ చదవండి: