ఇంటర్మీడియట్లో కీలక పాఠ్యాంశాలు తొలగించారంటూ... ఎస్ఎఫ్ఐ ఇంటర్ బోర్డు వద్ద ఆందోళనకు దిగింది. అంబేద్కర్, ఫూలే వంటి మహనీయుల చరిత్రను తొలగించడం విద్యా విధానాన్ని కించపరచడమేనని ఎస్ఎఫ్ఐ ఆరోపించింది. నైతిక విలువలు పెంచే స్ఫూర్తిదాయక అంశాలతో పాటు.. భవిష్యత్తుకు ఉపయోగపడే పాఠాలను తొలగించడం సరైన చర్య కాదని పేర్కొంది.
కుదించిన సిలబస్‌ను పునః పరిశీలించి... సంఘ సంస్కర్తలు, స్వాతంత్య్ర సమరయోధులకు సంబంధించిన పాఠ్యాంశాలను మళ్లీ చేర్చాలని ఎస్ఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు. పాఠ్యాంశాల తొలగింపు ప్రతిపాదనలు మాత్రమే.. ప్రభుత్వం ఇంకా ఆమోదించలేదని ఎస్ఎఫ్ఐ నేతలకు ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ తెలిపారు. సంఘ సంస్కర్తలపై పాఠ్యాంశాలను తొలగించబోమని వారికి హామీ ఇచ్చారు.