Vijayawada National Highway: హైదరాబాద్ శివారులో విజయవాడ జాతీయ రహదారి గుంతలతో నిండిపోయింది. ఎల్బీనగర్ దాటిన తరవాత ఔటర్ రింగు రోడ్డు ఆరంభం నుంచి సుమారు పది కిలోమీటర్ల రహదారి అధ్వానంగా మారింది. అబ్దుల్లాపూర్‌మెట్, బాటసింగారం, కొత్తగూడ, మల్కాపూర్ వరకు వందల సంఖ్యలో గుంతలున్నాయి. నిత్యం పెద్ద ఎత్తున వాహనాలు రాకపోకలు సాగిస్తూ రద్దీగా ఉండే ఈ మార్గం.. ఇటీవల కురిసిన వర్షాలకు దారుణంగా దెబ్బతింది. అధికారులు మట్టి పోసి తాత్కాలిక మరమ్మతులు చేసినా.. అవి మూణ్నాళ్ల ముచ్చటే అయ్యాయి. దీంతో ఈ పది కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తి చేసేందుకు సుమారు గంట సమయం పడుతోంది. అప్రమత్తంగా లేకపోతే ప్రమాదాలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. అధికారులు అప్రమత్తంగా, వ్యూహాత్మకంగా వ్యవహరించకపోతే రానున్న రెండేళ్లు ఈ మార్గంలో ప్రయాణించే వారి అవస్థలు వర్ణనాతీతంగా ఉండనున్నాయి.
![](https://assets.eenadu.net/article_img/030822gh-main20a.jpg)
ఎల్బీనగర్ నుంచి దండుమల్కాపూర్ వరకు సుమారు 22 కిలోమీటర్ల మేర రహదారిని విస్తరించనున్నారు. ఈ మార్గంలో ఏడు ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు నిర్మించనున్నారు. రహదారిని ఇరువైపులా మరింతగా విస్తరించనున్నారు. ఇందుకోసం కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ రూ.415 కోట్లను మంజూరు చేసింది. ఇటీవలే గుత్తేదారు ఎంపిక, ఒప్పంద ప్రక్రియ కూడా పూర్తయింది. రెండేళ్ల వ్యవధిలో ఈ విస్తరణ పనులు పూర్తి చేయాలన్నది లక్ష్యం. ఈ నేపథ్యంలో ఫ్లైఓవర్ల నిర్మాణానికి రోడ్డు మధ్యలో కొంత భాగాన్ని బారికేడ్లతో మూసివేయనున్నారు. అప్పుడు కూడా రోడ్డు ఇలాగే ఉంటే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవు. ఈలోగా అధికారులు ఈ రహదారిని పూర్తిస్థాయిలో చక్కదిద్దాల్సిన అవసరం ఉంది.
![](https://assets.eenadu.net/article_img/030822gh-main20b.jpg)