మనం వదిలే బొగ్గుపులుసు వాయువును స్వీకరించి స్వచ్ఛమైన ప్రాణవాయువును ఇస్తాయి పచ్చని చెట్లు. గాలిలో కాలుష్యాన్ని నియంత్రించి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. అలాంటిది ఆ చెట్లతోనే ఇప్పుడు అనారోగ్యానికి గురవుతున్నామని ఆరోపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ విశాఖ వాసులు. హుద్‌హుద్ తుఫాన్ తరువాత ఈప్రాంతాల్లోని చెట్లు, మొక్కలు పూర్తిగా నాశనమయ్యాయి. దీంతో విశాఖ నగరాభివృద్ధి సంస్థ ఏడాకుల మొక్కలను నాటారు. ఆల్స్టోనియా స్కాలరీస్ శాస్త్రీయ నామంతో పిలిచే వీటికి త్వరగా పెరిగే గుణం ఉండటం వల్ల ఐదు లక్షల మొక్కలను నగరమంతా నాటారు.
ఆ చెట్ల వల్లే ఇబ్బందులంటున్న స్థానికులు..
పెరిగి పెద్దవైన ఈ ఏడాకుల మొక్కలు ఇప్పుడు నగర వాసులకు ప్రాణ సంకటంగా మారాయి. పూత దశలో ఉండగా చెట్ల నుంచే వచ్చే వాసన శ్వాస కోశ వ్యాధులకు కారణమవుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సాయంత్రం పూట ఈ మొక్క నుంచి వచ్చే వాయువులు కొద్దిపాటి మత్తును కలుగజేస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. విశాఖలోని బీచ్ రోడ్డులోని పార్క్ హోటల్ నుంచి అప్పుఘర్ వరకు మూడు కిలోమీటర్ల మేర రహదారులకు ఇరువైపులా ఈ చెట్లు విస్తరించి ఉన్నాయి. ఎంవీపీ కాలనీ, అప్పుఘర్, జాలరిపేట, పెద్ద వాల్తేర్, ప్రాంత వాసులకు ఈ చెట్లు కారణంగా గొంతు నొప్పి, ఊపిరి ఆడకపోవడం వట్టి పరిస్థితులు తలెత్తుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఈ చెట్లు కింద నిలబడటానికే భయపడిపోతున్న నగర వాసులు వీటిని వెంటనే తొలిగించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఈ చెట్లను తొలిగించినప్పటికీ ఎక్కువ జనసంచారం ఉండే బీచ్ రోడ్డు పొడవునా ఈ మొక్కలున్నాయి. దీంతో నగర వాసులు ఈ మొక్కల ప్రభావానికి గురై ఆనారోగ్యాలకు గురవుతున్నారని ఆందోళన చెందుతున్నారు.
ఇవీ చూడండి... 'సీజనల్ వ్యాధులు ప్రబలకుండా నగరమంతా శానిటైజేషన్ డ్రైవ్'