వివిధ సామాజిక వర్గాలకు ఆత్మగౌరవ భవనాలను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా హైదరాబాద్ బంజారాహిల్స్‌లో బంజారా, ఆదివాసీ వర్గాల కోసం భవనాలను నిర్మించింది. ఆయా వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీకలుగా సేవాలాల్ బంజారా భవన్, కుమురంభీం ఆదివాసీ భవన్‌ల నిర్మాణం జరిగింది. ఎకరానికిపైగా విస్తీర్ణంలో విశాలంగా ఈ భవనాలను నిర్మించారు. ఆయా సామాజిక వర్గాల సంస్కృతీ, సంప్రదాయాలకు అద్దం పట్టేలా నిర్మాణాలు జరగాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా భవనాల నిర్మాణం జరిగింది. కొద్ది రోజుల క్రితమే వీటి నిర్మాణం పూర్తైంది.
బంజారా, ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, నాగరికత ఉట్టిపడేలా భవనాలను నిర్మించారు. అందుకు తగ్గట్లుగా భవనాలను సుందరంగా తీర్చిదిద్దారు. భవనాల లోపల గోడలపై అందమైన కళాకృతులను పేర్చారు. వారి కళలను ప్రతిబింబించేలా చిత్రాలను ఏర్పాటు చేశారు. వారి సంస్కృతి , నాగరికతకు అద్దం పట్టేలా వారి పనిముట్లు, వేటకు ఉపయోగించిన పరికరాలు, వస్త్రాలు, ఇతర సామగ్రిని అక్కడ ప్రదర్శనగా ఉంచారు.
కళాకృతులతో ప్రత్యేకంగా గ్యాలరీలను అందుబాటులో ఉంచారు. సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు వీలుగా పెద్ద వేదిక, విశాలమైన సభా మందిరం, భోజనశాలను నిర్మించారు. ఆయా వర్గాల వారికి సంబంధించిన సభలు, సమావేశాల నిర్వహించుకోవడంతో పాటు శుభకార్యాలు కూడా జరుపుకునేందుకు అనువుగా వీటిని నిర్మించారు. వారి ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాలకు అనువుగా ఏర్పాటు చేశారు.
వివిధ జిల్లాల్లో నిర్మాణాలు పూర్తి చేసుకున్న సమీకృత కలెక్టరేట్లను ప్రారంభిస్తున్న సీఎం కేసీఆర్ బంజారా, ఆదివాసీ భవన్లను త్వరలోనే ప్రారంభించాలని నిర్ణయించారు. భవనాల ప్రారంభ వేళ ఆయా సామాజికవర్గాల ప్రతినిధులను భారీ ఎత్తున సమీకరించి బహిరంగ సభ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇవీ చదవండి: బాధిత కుటుంబాల పరామర్శకు సమయం లేదు.. కానీ బిహార్ వెళ్లే సమయం ఉందా?
పొట్టలో 62 చెక్క ముక్కలు, 15 స్ట్రాలు, 2 హెన్నా కోన్స్.. డాక్టర్లు రెండు గంటలు కష్టపడితే...