Senior Leaders Stayed Away in Telangana Elections 2023 : తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీల సీనియర్ నాయకులు పలువురు వివిధ కారణాలతో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలకు దూరమయ్యారు. కుందూరు జానారెడ్డి, డీకే అరుణ, నాగం జనార్దన్‌రెడ్డి, చిన్నారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, కిషన్‌రెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి తదితరులు ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. వారిలో ఒక్క కిషన్‌రెడ్డి మినహా మిగిలిన వారందరూ మాజీ మంత్రులే ఉన్నారు. వారు రాజకీయాల్లోకి ప్రవేశించి శాసనసభ ఎన్నికల్లో (Telangana Assembly Elections 2023) పోటీ చేయడం ప్రారంభించాక.. ఎన్నికలకు దూరంగా ఉండటం ఇదే మొదటిసారి కావడం విశేషం.
కుందూరు జానారెడ్డి : కాంగ్రెస్‌లో సీనియర్ నాయకుడిగా గుర్తింపు పొందారు. 1978లో మొదటిసారి నల్గొండ జిల్లా చలకుర్తి నుంచి జనతా పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత రెండుసార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1989లో కాంగ్రెస్ నుంచి విజయం సాధించగా.. అప్పటి నుంచి అదే పార్టీలో కొనసాగుతున్నారు. 1994, 2018 ఎన్నికలు, 2021 ఉప ఎన్నికల్లో పరాజయం మినహా.. అన్ని ఎన్నికల్లో విజయం సాధించారు. 2009లో చలకుర్తి రద్దవడంతో నాగార్జునసాగర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి జానారెడ్డి (Congress Leader Jana Reddy) పోటీ నుంచి తప్పుకోగా.. ఆయన కుమారుడు జైవీర్‌రెడ్డి నాగార్జునసాగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.
ఎట్టెట్టా - యువజన బృందాలకు గోవా ఆఫర్లు - బూత్ స్థాయి నేతలకు మందు, విందు, పదివేలు పక్కా!
పొన్నాల లక్ష్మయ్య : జనగామ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా 1985లో తొలిసారి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 1989, 1999, 2004, 2009లో గెలుపొందారు. 2014, 2018లో వరుసగా పరాజయం పాలయ్యారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలి పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఈసారి టికెట్ దక్కకపోవడంతో ఇటీవల పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్‌లో చేరారు.
నాగం జనార్దన్‌రెడ్డి : 1983లో మొదటిసారి టీడీపీ అభ్యర్థిగా నాగర్‌కర్నూల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 1985, 1994, 1999, 2004, 2009లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2013 నుంచి 2018 వరకు బీజేపీ ఉండి.. అనంతరం కాంగ్రెస్‌లో చేరారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓడిపోయారు. ఈసారి టికెట్ దక్కకపోవడంతో తాజాగా నాగం జనార్దన్‌రెడ్డి (Nagam Janardhan Reddy) బీఆర్ఎస్‌లో చేరారు.
చిన్నారెడ్డి : వనపర్తిలో 1985లో మొదటిసారి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత 1989, 1999, 2004, 2014లో విజయం సాధించారు. 1994, 2009లో ఓటమి చవిచూశారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ తొలుత టికెట్ ప్రకటించినా.. ఆ తర్వాత మేఘారెడ్డికి సీటును కేటాయించింది.
గీతారెడ్డి : మొదటిసారి 1989లో గజ్వేల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2004లో మరోసారి అక్కడ గెలిచారు. 2009, 2014 ఎన్నికల్లో జహీరాబాద్ నుంచి విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో ఓడిపోయారు. ప్రస్తుతం గీతారెడ్డి అనారోగ్యం తదితర కారణాలతో టికెట్ అడగలేదు.
ఓటమితో మొదలెట్టి - ఆపై గెలుపు బండెక్కి, ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూసుకోని నేతలెవరో తెలుసా?
పట్నం మహేందర్‌రెడ్డి : 1994, 1999, 2009లో తాండూరు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. 2014లో బీఆర్ఎస్‌లో (టీఆర్ఎస్) చేరి అదే స్థానం నుంచి నాలుగోసారి గెలుపొందారు. 2018లో పరాజయం పాలయ్యారు. బీఆర్ఎస్(టీఆర్ఎస్) నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచి.. ఇటీవలే గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తాజా ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.
డీకే అరుణ : 1999లో తొలిసారి కాంగ్రెస్ నుంచి గద్వాలలో పోటీచేసి ఓడిపోయారు. 2004లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. మళ్లీ కాంగ్రెస్‌లో చేరి 2009, 2014లో గెలుపొందారు. 2018లో ఓటమి పాలయ్యారు. 2019లో బీజేపీలో చేరిన డీకే అరుణ (DK Aruna) ప్రస్తుతం పోటీ చేసేందుకు ఆసక్తి చూపలేదు.
కిషన్‌రెడ్డి : 2004లో తొలిసారి హిమాయత్‌నగర్ నుంచి గెలిచి శాసనసభలో అడుగుపెట్టారు. 2009లో ఆ నియోజకవర్గం రద్దుతో 2009, 2014లో అంబర్‌పేట నుంచి గెలుపొందారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా విజయం సాధించి, కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కిషన్‌రెడ్డి (BJP President Kishan Reddy) పోటీకి ఆసక్తి చూపలేదు.
సరిహద్దులపైనే అందరి ఫోకస్- ఈసారి పొలిమేరలో ఎవరిదో కేక
ప్రలోభాలపై ఈసీ ప్రత్యేక నజర్ - గతానుభవాల దృష్ట్యా పకడ్బందీ చర్యలు