తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల పెంపు విషయం.. మరోసారి చర్చనీయాంశమైంది. విభజన నాటి నుంచి.. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు, పార్టీల నేతలు సందర్భం వచ్చినప్పుడల్లా శాసనసభ స్థానాల పెంపుపై ప్రస్తావిస్తూ వచ్చారు. రాజ్యాంగం ప్రకారం ఇప్పట్లో అలాంటి అవకాశం లేదని కేంద్ర పెద్దలు బదులిచ్చిన వార్తలూ వచ్చాయి. అయితే ఓ సమాచార హక్కు దరఖాస్తు.. తాజాగా కొత్త విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే సీట్ల పెంపు దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతూ... ఈ ఏడాది ఏప్రిల్లోనే ఎన్నికల సంఘానికి కేంద్రం నోట్ పంపిన విషయం బయటపెట్టింది.
ఈ మేరకు తెలంగాణలో 119 నుంచి 153కు.. ఆంధ్రప్రదేశ్లో 175 నుంచి 225కు శాసనసభ స్థానాలు పెంచాలని ఎన్నికల సంఘానికి కేంద్రం నోట్ పంపినట్టు స్పష్టమైంది. ఇందుకు సీఈసీ కూడా బదులిచ్చింది. ఆ నోట్ సరిగా లేదని.. పూర్తి వివరాలతో సరైన సమాచారం మరోసారి పంపాలని కేంద్ర హోం శాఖను కోరింది. శాసనసభ స్థానాల పెంపుపై ఇనగంటి రవికుమార్ అనే వ్యక్తి చేసుకున్న దరఖాస్తుతో ఎన్నికల సంఘం ఈ సమాచారాన్ని ఇచ్చింది.
ఇదీ చూడండి: పురపాలక ఎన్నికలపై అధికారులకు శిక్షణ