గ్రామం యూనిట్‌గా ప్రజలకు విభిన్న రకాల సేవలు అందించడానికి ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా, ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటుచేశారు. వీటి కార్యాలయాల కోసం చేపట్టిన భవనాల నిర్మాణాలకు నిధుల కొరత ప్రతిబంధకమవుతోంది. పనులను ప్రారంభించిన గుత్తేదారులు... బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో పలుచోట్ల అసంపూర్తిగా నిలిపేస్తున్నారు. ఇప్పటివరకు చేసిన పనులకు రూ.200 కోట్లకుపైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది.
ఏపీ వ్యాప్తంగా 10,929 గ్రామ సచివాలయాలు, మరో 10,404 రైతు భరోసా కేంద్రాలు, 8,585 ఆరోగ్య కేంద్రాలకు (వైఎస్‌ఆర్ హెల్త్ క్లినిక్) భవనాల నిర్మాణాల కోసం ప్రభుత్వం ఇప్పటికే అనుమతులిచ్చింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(నరేగా)లో ‘మెటీరియల్ కాంపోనెంట్’ కింద నిధులను సమకూర్చాలని నిర్ణయించారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ రూ.7 వేల కోట్లకుపైగా అంచనాలతో అన్ని భవనాల నిర్మాణ బాధ్యతను గుత్తేదారులకు అప్పగించింది. పనుల్లో పురోగతి ఆధారంగా ఇంజినీర్లు బిల్లులను అప్‌లోడ్ చేశాక... ఉన్నతస్థాయిలో పరిశీలించి నిధులను కేటాయిస్తుంటారు. కొద్ది రోజులుగా నరేగాలో మెటీరియల్ కాంపోనెంట్ నిధుల విడుదలలో జాప్యంతో బిల్లులు సమయానికి రావడంలేదు. పెట్టుబడులుగా సొంత డబ్బులను ఖర్చు చేసిన గుత్తేదారులు ప్రస్తుతం చాలాచోట్ల పనులను నిలిపివేస్తున్నారు. వివిధ జిల్లాల్లో కొందరు గుత్తేదారులు ఇప్పటికీ మొదటి బిల్లుకు సైతం నోచుకోలేదు. ఇప్పటికే రూ.200 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయని పలువురు వాపోతున్నారు.
- ప్రస్తుతం 2,882 సచివాలయ భవనాల పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. మిగతా 8,047 భవనాల్లో 65% వివిధ దశల్లో ఉండగా, మిగిలిన 35% అసంపూర్తిగా నిలిచిపోయాయి.
- రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి 4,085 భవనాల నిర్మాణాలు శ్లాబ్ దశలో ఉన్నాయి. మిగతావి నిధుల కొరతతో మందకొడిగా సాగుతున్నాయి.
- 2,590 ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. మిగతా వాటిలో కొన్నింటికి స్థలాలను కేటాయించాల్సి ఉంది.
ఉన్నతాధికారుల ఒత్తిడితో ఇంజినీర్లలో వణుకు
సరిపడా నిధులను విడుదల చేయకుండానే పనుల్లో జాప్యంపై పంచాయతీరాజ్ ఇంజినీర్లను బాధ్యులను చేస్తుండటంతో వారంతా హడలిపోతున్నారు. ఇదే కారణంతో అనంతపురం జిల్లాలో మండల స్థాయి ఇంజినీర్ ఒకర్ని తాజాగా సస్పెండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన ఉపాధి హామీ పనులపై విజిలెన్స్, అవినీతి నిరోధకశాఖ విచారణతో ఇప్పటికే ఇంజినీర్లపై అభియోగాలు నమోదవుతున్నాయి. ఈ చర్యలను నిరసిస్తూ ఇంజినీర్లు ఇటీవల రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపట్టారు. మరోవైపు నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో పాత పనులపై ఇంజినీర్లను బాధ్యులను చేసే ప్రక్రియ మొదలైంది. సచివాలయ, రైతు భరోసా, ఆరోగ్య కేంద్ర భవనాలకు పలుచోట్ల స్థల సమస్య, పనులు ప్రారంభించిన చోట నిధుల కొరత వంటివి వెన్నాడుతున్నాయి. వీటి పరిష్కారంపై దృష్టి నిలపకుండా పనుల్లో జాప్యం జరుగుతోందంటూ ఉన్నతాధికారులు తమను బాధ్యులను చేయడం ఎంతవరకు భావ్యమని ఇంజినీర్లు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని నిధులు విడుదల చేస్తే పనుల్లో వేగం పెరుగుతుందని గుత్తేదారులు సైతం అభిప్రాయపడుతున్నారు.
ఇదీచదవండి: నేడు టీఎస్‌బీపాస్ వెబ్‌సైట్‌ను ప్రారంభించనున్న కేటీఆర్