Lokesh Yuvagalam : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర కుప్పం నియోజకవర్గంలో రెండోరోజు ప్రారంభమైంది. కుప్పంలో ప్రారంభించిన ఈ పాదయాత్ర రెండో రోజు సైతం పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొని లోకేశ్‌తో కలిసి పాదం కలిపారు. కుప్పంలో పీఈఎస్ వైద్య కళాశాల నుంచి ఆయన యాత్ర కొనసాగించారు.
విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా అనేకమంది విద్యార్థులు లోకేశ్‌తో సెల్ఫీలు దిగారు. కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ఘనస్వాగతం లభించింది. విద్యార్థులు లోకేశ్ కటౌట్‌కి పాలాభిషేకం చేశారు. చంద్రబాబు తమ ప్రాంతానికి డిగ్రీ కళాశాల తెచ్చిన కృతజ్ఞతతో అభిమానం చాటుకుంటున్నామని విద్యార్థులు తెలిపారు.
ఆ తర్వాత భారీగా తరలివచ్చిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి అడుగులు ముందుకు వేశారు. ఇవాళ పాదయాత్రలో భాగంగా గుడుపల్లె మండలం బెగ్గిపల్లె గ్రామస్థులతో లోకేశ్ సమావేశమయ్యారు. కనుమలదొడ్డి ప్రజలతో ముఖాముఖి నిర్వహించి.. గ్రామస్థుల నుంచి వినతులు స్వీకరించారు. తెలుగుదేశం ప్రభుత్వం రాగానే సామాజిక భవనాల నిర్మాణం పూర్తిచేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.
గ్రామంలో అసంపూర్తిగా ఉన్న కురుమ భవనాన్ని, ఆ పక్కనే ఉన్న వాల్మీకి భవానాన్నీపరిశీలించారు. వైసీపీ వచ్చాక అణచివేతకు గురవుతున్న అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇస్తామని హామి ఇచ్చారు. అలాగే తెలుగుదేశం నాయకులను కేసులతో వేధిస్తున్న వారికి చక్రవడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. అనంతరం కనుమలదొడ్డిలో ప్రజల నుంచి వినతుల స్వీకరించి.. వారితో మాట్లాడనున్నారు. కనుమలదొడ్డిలోనే మధ్యాహ్న భోజన విరామం చేయనున్న లోకేశ్.. అక్కడే పార్టీ నేతలతో భేటీ కానున్నారు. రాత్రికి తుమ్మిశి చెరువులో లోకేశ్ బస చేయనున్నారు.
ఇవీ చదవండి :