కృష్ణా నదిలో భారీగా వరద ప్రవాహం పెరిగింది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి 7 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు వచ్చి చేరుతోంది. ప్రకాశం బ్యారేజీ నీటిమట్టం 15 అడుగులకు చేరడంతో బ్యారేజీ గేట్లపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. గేట్లు మొత్తం ఎత్తి 5.5 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. వరద తీవ్రత ఎక్కువైనందున బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పవిత్ర సంగమం వద్ద పుష్కర్‌నగర్‌లోకి వరద నీరు వచ్చి చేరింది. ప్రవాహం మరింత ఎక్కువైతే ఇబ్రహీంపట్నం ప్రధాన రహదారిపైకి వరద నీరు వచ్చే అవకాశముంది. ముంపువాసులు ఇళ్లను వదిలి రోడ్లపైకి చేరారు. జిల్లాయంత్రాంగాన్ని విపత్తు నిర్వహణశాఖ అప్రమత్తం చేసింది. నదీ పరివాహక ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిందిగా సూచించింది.
మరోవైపు గుంటూరు జిల్లా అమరావతి మండలం పెద్దమద్దూరు గ్రామాన్ని కృష్ణా వరద నీరు ముంచెత్తింది. మద్దూరు వంతెనపై వరద నీరు భారీగా చేరింది. అమరేశ్వర ఆలయం నుంచి విజయవాడ వెళ్లే మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. కృష్ణా నదిలో వరద ఉద్ధృతి దృష్ట్యా గ్రామాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. మోపిదేవి, కొక్కిలిగడ్డ, కొత్తపాలెం హరిజనవాడ ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. బొబ్బర్లంక గ్రామస్థులను కూడా ఖాళీ చేయించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
చంద్రబాబు నివాసం వైపునకు వరద నీరు...
అమరావతిలో చంద్రబాబు నివాసం వైపునకు వరద నీరు చేరింది. నది వెంబడి ఉన్న అతిథిగృహాలను వరద నీరు తాకుతోంది. చంద్రబాబు నివాసం వద్ద వరద పరిశీలించేందుకు ఎమ్మెల్యే ఆర్కే వచ్చారు. కానీ... చంద్రబాబు భద్రతా సిబ్బంది లోపలికి వెళ్లేందుకు అనుమతించలేదు. ప్రభుత్వ స్థలంలోకి వెళ్లేందుకు అనుమతి అవసరం లేదంటూ... ఎమ్మెల్యే ఆర్కే వెళ్లారు.
ఇదీ చదవండీ...కొత్త అందాలు సంతరించుకున్న సంగమ ప్రదేశం