మున్సిపాల్టీ, కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల విజయోత్సవ ర్యాలీలపై నిషేధం ఉందని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. కౌంటింగ్ హాల్ వద్ద, బయట జనసమూహాలు ఏర్పడకుండా చర్యలు తీసుకున్నామని... కౌంటింగ్ ప్రక్రియలో కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొంది. కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే సిబ్బందికి కలెక్టర్ ఆధ్వర్యంలో కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది.
మొత్తం 6,559 మందికి పరీక్షలు చేయగా.. 308 మందికి పాజిటివ్‌గా తేలిందని వారి స్థానంలో వేరే వారిని కౌంటింగ్ సిబ్బందిగా నియమించినట్లు వెల్లడించింది. ప్రతి కౌంటింగ్ సెంటర్ వద్ద వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది. నిన్న కౌంటింగ్ హాళ్లను శానిటైజ్ చేసిన తర్వాత మెడికల్ నోడల్ ఆఫీసర్ ద్వారా ధ్రువీకరణ పొందినట్లు పేర్కొంది. కౌంటింగ్‌లో పాల్గొనే ప్రతి ఒక్కరు మాస్క్ ధరించేలా చర్యలు చేపట్టినట్లు ప్రకటించింది.