రోజురోజుకి విస్తరిస్తున్న కరోనా వైరస్ నుంచి ఎవరికి వారు తప్పించుకునేందుకు మాస్కులు ధరించడం, చేతులను శానిటైజ్ చేసుకోవడం తదితర జాగ్రత్తలు పాటిస్తున్నారు. కొవిడ్-19 ఎప్పటికి నియంత్రణలోకి వస్తుందో నిపుణులు సైతం చెప్పలేని పరిస్థితి. ఇంతలో వానాకాలం రానే వచ్చింది. ఇప్పుడు సీజనల్ వ్యాధుల భయం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. స్వీయ జాగ్రత్తలు, పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చని చెబుతున్నారు.
దోమలు దాడి చేయనున్నాయ్
- వర్షాకాలంలో దోమలు దాడి చేస్తుంటాయి. జూన్ నుంచి జనవరి వరకు వీటి భయం ఉంటుంది. ఇళ్ల చుట్టూ ఖాళీ స్థలాలుంటే నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఇంట్లో డ్రమ్ములు, ట్యాంకులపై మూతలు పెట్టాలి. 3-4 రోజులకు ఒకసారి ఖాళీ చేసి ఎండబెట్టాలి.
- ఇంట్లో చీకటి మూలల్లో చెత్త ఉండనివ్వొద్దు. పాత సామగ్రి తక్షణం తొలగించాలి. పూలకుండీల్లో నీళ్లు నిల్వ ఉంచరాదు. తలుపులు, కిటికీల తెరలు తరచూ శుభ్రం చేయాలి. కూలర్లలో నీళ్లు ఎప్పటికప్పుడు మార్చాలి.
- పగటి పూట నిద్రపోతే రక్షణకు తెరలు, నివారణ మందులు వినియోగించాలి.
- జ్వరం, పొడి దగ్గు, జలుబు, శ్వాసలో ఇబ్బందులు, రుచి, వాసన కోల్పోవడం లాంటి లక్షణాలు ఉంటే కరోనాగా భావించాలి.
- తగ్గని జ్వరం, ఒంటిపై దద్దుర్లు, వాంతులు, తలనొప్పి, కండరాల నొప్పి, కళ్లు కదల్చలేని పరిస్థితి ఉంటే డెంగీగా భావించాలి.
తేమతో కూడిన వాతావరణం వల్ల చర్మం, పాదాలకు ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు సోకుతాయి. బయట నుంచి ఇంట్లోకి వచ్చే ముందు కాళ్లను శుభ్రంగా కడుక్కొని పొడి వస్త్రంతో తుడుచుకోవాలి. కాలి వేలి గోళ్లు పెరగనివ్వొద్దు. వాతావరణంలో మార్పుల వల్ల ఆస్తమా, సైనస్ సమస్యలు పెరుగుతాయి. మూడు రోజులు కంటే జ్వరం, జలుబు, దగ్గు లాంటివి వేధిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. వారి సూచనల మేరకు హెపటైటిస్-ఎ, టైఫాయిడ్‌ల లాంటి వాటికి టీకాలు తీసుకోవచ్చు.
డా.అఫ్తాబ్ అహ్మద్, సీనియర్ ఫిజీషియన్, అపోలో
కలుషిత ఆహారం...నీళ్లు!
- తాగునీటి ద్వారా డయేరియా, టైఫాయిడ్, పచ్చకామెర్లు, కలరా లాంటి వ్యాధులు సంక్రమిస్తాయి. కాచి, చల్లార్చి, వడబోసిన నీటిని తాగడం మేలు.
- ఆకు కూరలు, కూరగాయలు బాగా కడగాలి. బాగా ఉడికించిన తర్వాత తినాలి. దీనివల్ల ఈకోలి తదితర బ్యాక్టీరియా ముప్పు తప్పించుకోవచ్చు.
- వేడిగా ఉన్నప్పుడే ఆహారం తీసుకోవాలి. హోటళ్లలో తినకపోవడం మంచిది. పరిశుభ్రమైన ఆహారం చాలా అవసరం. లేదంటే విరోచనాలు, వాంతులతో మొదలై డయేరియా, కలరా వ్యాప్తి చెందే అవకాశం ఉంది.
ఇదీ చూడండి: యుద్ధ వ్యూహాలతో శత్రు దేశాలను ఎదుర్కొందాం : సీఎం కేసీఆర్