కొత్త రెవెన్యూ చట్టం కోసం సెప్టెంబర్ 8 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సేవలు నిలిపేశారు. అప్పటి నుంచి మ్యుటేషన్లు నిలిచిపోయాయి. భూములు కొని రిజిస్ట్రేషన్ చేసుకొని మ్యుటేషన్‌కు దరఖాస్తు చేసిన వారు, చేయడానికి సిద్దపడి ఆగిపోయిన వేలాదిమంది ఇపుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధరణిలో పాత యజమానులు పేర్లే ఉన్నాయి. కొందరు నిజాయితీగా హక్కులు బదలాయిస్తుండగా అవకాశవాదులు ఇదే అదునుగా బురిడీ కొట్టిస్తున్నారని రెవెన్యూ అధికారులే అంగీకరిస్తున్నారు.
తప్పులు జరిగేందుకు ఆస్కారం...
పోర్టల్ భూసేవల విషయంలో ధరణి ఎంతో అనువుగా ఉన్నప్పటికీ పొరపాట్లు జరగకుండా అడ్డుకట్ట వేసే వ్యవస్థ అందులో లేదు. పాతపద్ధతిలో రిజిస్ట్రేషన్ సమయంలో భూముల చరిత్రను పరిశీలించేందుకు ఈసీ పరిశీలన ఉండేది. తద్వారా తహసీల్దార్ స్థాయిలో మ్యుటేషన్ సందర్భంగానూ గతంలో సదరు భూమికి రిజిస్ట్రేషన్లు జరిగాయా? లేదా? అనేది పరిశీలించేవారు. ప్రస్తుతం ధరణి వేదికగా ఏకకాలంలో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తిచేస్తుండడం వల్ల తప్పులు జరిగేందుకు ఆస్కారం ఏర్పడుతోందనే విమర్శలున్నాయి.
ప్రారంభం కాని సేవలు...
1970 ఏజెన్సీచట్టం అమల్లో ఉన్న ఉమ్మడి ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ధరణి పోర్టల్ సేవలు ఇంకా ప్రారంభంకాలేదు. ఈ జిల్లాల్లో గిరిజనులకు, గిరిజనులకు మధ్య మాత్రమే భూలావాదేవీలు జరగాల్సి ఉంది. గిరిజనేతరులు కొనడానికి, యాజమాన్య హక్కుల బదిలీకి వీలులేదు. వారంలో పోర్టల్ ఆరంభమయ్యే అవకాశాలున్నాయని ఆయా జిల్లాలకు చెందిన అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన ధరణి పోర్టల్