SBI Adopts Tigers: భారతీయ స్టేట్ బ్యాంక్ హైదరాబాద్ సర్కిల్ నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో 15 పులులను దత్తత తీసుకుంది. ఇవాళ ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ సీజీఎం జింగ్రాన్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆర్.శోభ ఇతర అధికారులతో కలిసి జంతు ప్రదర్శన శాలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రదర్శనశాలలోని 15 పులులకు ఏడాదిపాటు అయ్యే ఆహార ఖర్చును భరించేందుకు ఎస్బీఐ ముందుకొచ్చింది. ఇందుకోసం అవసరమైన రూ.15లక్షల చెక్కను సీజీఎం జింగ్రాన్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ శోభకు అందచేశారు.
ఎస్బీఐ తోడ్పాటు...
అంతరించిపోతున్న జాతుల రక్షణలో భారతీయ స్టేట్ బ్యాంక్ హైదరాబాద్ సర్కిల్ భాగస్వామ్యమవుతున్నట్లు ఎస్పీఐ సీజీఎం జింగ్రాన్ చెప్పారు. గడిచిన పదేళ్లుగా జంతువుల పరిరక్షణకు తమ సంస్థ చొరవ చూపుతూ వస్తున్నట్లు ఆయన వివరించారు. పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టే కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడంలో భారతీయ స్టేట్ బ్యాంకు ఎల్లప్పుడు ముందుంటుందని జింగ్రాన్ స్పష్టం చేశారు. పార్కులో కలియతిరిగిన ఎస్బీఐ, ఫారెస్టు అధికారులు జంతువుల పరిరక్షణకు, పరిశుభ్రతకు అధికారులు తీసుకుంటున్న చర్యలను అభినందించారు. నగరం మధ్యలో విశాలమైన విస్తీర్ణంలో భారతదేశంలో అతిపెద్ద జంతు ప్రదర్శనశాలల్లో నెహ్రూ జూలాజికల్ పార్కు ఒకటని జింగ్రాన్ అన్నారు.
మొదటి జూ ఇదే...
హైదరాబాద్ నగరంలో చూడదగిన ప్రదేశాలలో ఒకటిగా పేర్కొన్న జింగ్రాన్... ఖడ్గమృగం, ఆసియాటిక్ సింహం, బెంగాల్ టైగర్, పాంథర్, ఏనుగు, జింకలు, అనేక రకాల జంతువులు, పక్షులు, సరీసృపాలు, క్షీరదాలు ఉన్నాయని వివరించారు. దేశంలో ఐఎస్‌ఓ ధ్రువీకరణ పత్రం పొందిన మొదటి జంతుప్రదర్శనశాల అని జింగ్రాన్ ప్రశంసించారు. గడిచిన 10 ఏళ్లుగా పులుల దత్తతకు ఆసక్తి కనబరుస్తున్న ఎస్బీఐకి ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆర్.శోభ కృతజ్ఞతలు తెలిపారు. వన్యప్రాణుల పరిరక్షణకు ఎస్బీఐ చొరవ చూపుతూ ఉదాత్తంగా ముందుకు రావడం ఇతర కార్పొరేట్ సంస్థలకు స్ఫూర్తినిస్తుందని శోభ అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి: Sangameshwara And Basaveshwara : సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టిన సీఎం