Sankranti Celebrations in Shilparamam 2024 : రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు (Sankranti Celebrations) ఘనంగా మొదలయ్యాయి. అవకాశం ఉన్నవారంతా సొంతూళ్లకు వెళ్లిపోయారు. దీంతో పల్లెల్లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఎటు చూసినా రంగురంగుల ముత్యాల ముగ్గులే దర్శనమిస్తున్నాయి. లోగిళ్లు బంధువులతో కళకళలాడుతున్నాయి. హరిదాసులు, గంగిరెద్దులు, భోగిమంటలు, భోగిపళ్లు, పిండి వంటలు, గాలిపటాలు, కొత్తబట్టలు, బొమ్మల కొలువులు, చెడుగుడు పోటీలు, పశువుల పందాలతో గ్రామాల్లో సందండి నెలకొంది.
అలా వెళ్లడం కుదరనివారు హైదరాబాద్‌లోనే జరుపుకుంటున్నారు. అలాంటి వాళ్లకు పల్లె అందాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది శిల్పారామం. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, ఎటుచూసినా మనసుకు ఉల్లాసాన్ని కలిగించే పచ్చని చెట్లు, ముత్యాల ముగ్గులు, బోటు షికారు ఒక్కటేమిటి, ఇలా అన్నీ సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. సొంతూళ్లకు వెళ్లలేని వారు శిల్పారామానికి వచ్చి ఈ అనుభూతులను మనసారా ఆస్వాదిస్తున్నారు.
సంక్రాంతి అసలు ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
Sankranti Celebrations in Telangana 2024 : శిల్పారామంలో (Sankranti Celebrations in Shilparamam)మూడు రోజులపాటు నిర్వహించే ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు నగరవాసులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. హరిదాసు, గంగ దేవర, బుడు బుక్కుల ,పిట్టల దొర వేషధారులు భవిష్యత్ తరాలకు, సంక్రాంతి విశిష్టతను తెలియజేస్తూ సందడి చేస్తున్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను నేటితరం పిల్లలకు తెలిసేలా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారని సందర్శకులు చెబుతున్నారు. చిన్ననాటి మధురస్మృతులు గుర్తుకు వస్తున్నాయని, సొంతూరుకు వెళ్లిన అనుభూతి కలుగుతుందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
" శిల్పారావడం చాలా బాగుంది. పల్లె వాతావరణం ఉట్టిపడేలా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడి హరిదాసు పాటలు, బసవన్న విన్యాసాలు, వాయిద్యాలు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు మమల్ని ఎంతో అకట్టుకుంటున్నాయి. గ్రామంలో ఉండే ఆట పాటలన్నింటిని ఇక్కడ చూడవచ్చు. చిన్ననాటి మధురస్మతులు గుర్తుకు వచ్చాయి. ఇక్కడికి రావడం చాలా బాగుంది." - సందర్శకులు
Sankranti Festival 2024 Celebrations In Telangana : శిల్పారామానికి ఏటా వస్తుంటామని, ఇక్కడకు రావడం సంతోషంగా ఉందని కళాకారులు తెలిపారు. పాతకాలంనాటి కళారూపాలను ఈతరం పిల్లలకు తెలియజేయాలనే ఉద్దేశంతో, దూరప్రాంతాల్లో ఉంటున్నా ఇక్కడికి వస్తుంటామని వెల్లడిచారు. సందర్శకులు తమపై చూపుతున్న అభిమానం మర్చిపోలేనిదంటూ హర్షం వ్యక్తం చేశారు. హరిదాసులు, గంగిరెద్దుల విన్యాసాలను వీక్షిస్తూ సందర్శకులు ఉల్లాసంగా గడిపారు. జ్ఞాపకాలు చిరకాలం గుర్తుండిపోయేలా ఫొటోలను తమ చరవాణుల్లో భద్రపరుచుకున్నారు. ఊరికి వెళ్లలేకపోయామనే దిగులును శిల్పారామం తీర్చిందంటూ ఆనందం వ్యక్తం చేశారు.
"ఈరోజు శిల్పారామంకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సంవత్సరం పండుగకి మా సొంతూరికి వెళ్లడానికి వీలు కాలేదు. ఇక్కడ పూర్తిగా పల్లెటూరి వాతావరణంలో ఉన్నట్లుగా అనుభూతి కలుగుతోంది. మా పిల్లలు బాగా సంతోషంగా ఉన్నారు. శిల్పారామంకు రావడంతో మా గ్రామానికి వెళ్లలేదన్న లోటు తీరింది. చిన్నప్పుడు మేము చూసినవన్నీ గుర్తుకు వచ్చాయి." - సందర్శకులు
ఇంటింటా కొత్త కాంతులు వెల్లివిరియాలి - హ్యాపీ సంక్రాంతి : సీఎం రేవంత్ రెడ్డి
సంక్రాంతి విశిష్టత ఏమిటి - దీనిని పెద్ద పండుగ అని ఎందుకు అంటారు?