Jaggareddy Letter: ఇకనుంచి తాను కాంగ్రెస్ పార్టీ గుంపులో లేనని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలను ఏకరవు పెడుతూ సోనియా, రాహుల్‌గాంధీ, పార్టీ ఇన్‌ఛార్జీలు కేసీ వేణుగోపాల్, మాణిక్యం ఠాగూర్‌కు జగ్గారెడ్డి లేఖ రాశారు. తెరాస కోవర్టుగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని.. లేఖలో ఫిర్యాదు చేశారు. రాష్ట్రం ఇప్పించిన కాంగ్రెస్ నుంచి ఎంతోమంది బయకు వెళ్లారని.. సడెన్‌గా లాబీయింగ్ చేస్తే ఎవరైనా పీసీసీ అధ్యక్షుడు కావచ్చనే అంశాలను ప్రస్తావించారు.
వేరే పార్టీలో వాళ్లు ఆహ్వానించినా తాను వెళ్లడం లేదని.. అమ్ముడు పోయాననే మచ్చ ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవాలు మాట్లాడితే యూట్యూబ్ ఛానళ్ల ద్వారా కోవర్ట్ అని ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. రెండు రాష్ట్రాలు చేస్తున్నప్పుడూ రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని చెబితే తెలంగాణ ద్రోహి అన్నారని గుర్తుచేశారు. రాజకీయాల్లో మర్యాదలు, వ్యూహాలు తదితర అంశాలను సోనియాగాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన జగ్గారెడ్డి.. మహాభారతంలో బీష్ముడు, పాండవుల అంశాన్నీ ప్రస్తావించారు.
త్వరలో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్ష పదవి, పార్టీకి రాజీనామా చేసి సోనియా, రాహుల్‌గాంధీకి లేఖ పంపిస్తానని జగ్గారెడ్డి విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. అంతకుముందు జగ్గారెడ్డిని వి.హనుమంతరావుతో పాటు పీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లి కిషన్ కలిశారు. కాంగ్రెస్‌ను వీడి వెళ్లవద్దని సూచించారు. బొల్లి కిషన్... జగ్గారెడ్డి కాళ్లు పట్టుకొని మరీ బతిమాలారు. కాంగ్రెస్‌కు దూరం కావద్దని.. పార్టీలోనే ఉంటూ అన్యాయాలపై కొట్లాడదామని సూచించారు. తననూ కోవర్టంటూ సాగిస్తున్న ప్రచారాన్ని ఖండించిన వీహెచ్.. జూబ్లీహిల్స్ పోలీసులను కలిసి ఫిర్యాదు చేశారు.