రాష్ట్రంలో నదులు, వాగులు, వంకల, జలాశయాల్లో దొరికే ప్రకృతి సంపద అక్రమార్కుల పరమవుతోంది. అనుమతుల ముసుగులో కొంత, అడ్డగోలుగా మరింత మొత్తంగా ఇసుక వారికి కాసులు కురిపిస్తోంది. కొన్నిచోట్ల రాత్రిపూట గుట్టుచప్పుడు కాకుండా తరలించుకుపోతుండగా.. మరికొన్నిచోట్ల పట్టపగలే వాగులను ఊడ్చేస్తున్నారు. పెద్ద మొత్తంలో ఆదాయం వస్తున్నందున అడ్డుకున్న వారిపై దాడులకూ పాల్పడుతున్నారు. వేగంగా వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకూ కారణమవుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా తిర్మలాపూర్‌లో గురువారం ఇసుక లారీ ఢీకొని ఓ రైతు మరణించడం ఇలాంటిదే.
వీటిని నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం అప్పుడప్పుడూ కేసులు పెడుతూ, మిగతా సమయాల్లో చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం వల్ల అక్రమ వ్యాపారం ‘మూడు లారీలు, ఆరు ట్రాక్టర్లు’ అన్నట్లుగా సాగుతోంది. స్థానికంగా పలుకుబడి ఉన్నవారి సహకారం వీరికి అందుతోందనే విమర్శలూ ఉన్నాయి.
అధికారిక సరఫరా తగ్గడం వల్ల దూకుడు
రాష్ట్ర ప్రభుత్వం నూతన ఇసుక విధానంలో భాగంగా టీఎస్‌ఎండీసీ ఆన్‌లైన్ బుకింగ్‌లతో గోదావరి, కృష్ణా, మూసీ వంటి నదులు, ఉప నదుల్లో గుర్తించిన ఇసుక రేవుల నుంచి విక్రయాలు జరుపుతోంది. వీటికితోడు జిల్లాల్లో కలెక్టర్లు వాగుల నుంచి సరఫరాకు ‘శ్యాండ్‌ట్యాక్సీ’ విధానం అమలుచేస్తున్నారు. వేసవిలో టీఎస్‌ఎండీసీ ప్రతి రోజూ 40వేల క్యూబిక్ మీటర్ల వరకు సరఫరా చేసేది. వర్షాల కారణంగా ఇప్పుడు 8-12 వేల క్యూబిక్ మీటర్లకు పరిమితం చేసింది. అధికారికంగా సరఫరా తగ్గడం వల్ల అక్రమార్కులు ఆ లోటును భర్తీ చేసే క్రమంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు.
ఇవిగో ఉదంతాలు:
* సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం వద్ద మూసీ నదిలో ఇసుక అక్రమ రవాణా రెండు దశాబ్దాలుగా నిరాటంకంగా కొనసాగుతుంది. ఆరేళ్ల వ్యవధిలో ఇసుక ట్రాక్టర్లు ఢీకొనీ, ఇతర ప్రమాదాల్లోనూ నలుగురు మరణించారు. తుంగగూడెంలో రెండేళ్ల కిందట ఎనిమిదేళ్ల బాలుడు ట్రాక్టరు ఢీకొని మరణించాడు.
ట్రాక్టర్ల యజమానులు కూటమి కట్టి
* రాజన్నసిరిసిల్ల జిల్లాలోని మానేరువాగు పరిసర గ్రామాల్లో రెవెన్యూ అనుమతుల పేరిట ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఎల్లారెడ్డిపేట మండలంలో జనవరిలో ఇసుక లోడుతో వెళ్తున్న వ్యాను గొల్లపల్లి వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడం వల్ల ఓ వ్యక్తి మరణించాడు.
* తంగళ్లపల్లి మండలంలో కస్బెకట్కూర్, గడ్డిలచ్చపేట తదితర గ్రామాల పరిధిలో మానేరు వాగు నుంచి తవ్వకాలు జరుగుతాయి. స్థానిక ప్రజాప్రతినిధులు, ఇసుక ట్రాక్టర్ల యజమానులు యూనియన్‌గా ఏర్పడి స్థానిక అనుమతుల పేరుతో ఇసుక తరలించి మండల శివారులోని రహస్య ప్రాంతాల్లో నిల్వచేసి సిద్దిపేట, రంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
* ములుగు జిల్లా మల్యాలలో 8 మంది రైతుల భూముల్లో ఇసుక మేటలు వేయడంతో ఇక్కడ ఇసుక తవ్వకాలకు అనుమతులిచ్చారు. గుత్తేదారు నకిలీ వేబిల్లులు, బార్‌కోడ్‌లతో యథేచ్ఛగా అక్రమ తరలింపులకు పాల్పడుతున్నారు. ఘట్కేసర్‌లో పోలీసులు ఈ వారంలో జరిపిన తనిఖీల్లో నకిలీ వేబిల్లుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆరుగురు అరెస్టయ్యారు.
* భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలం గోదావరి తీరప్రాంతాల్లో 28 ఇసుక రేవులున్నాయి. ఇక్కణ్నుంచి ఒక్కో లారీలో 1-2 టన్నులు అదనంగా నింపుకెళ్తుండటం వల్ల ప్రభుత్వాదాయానికి గండిపడుతోంది. రాత్రి వేళల్లో కొన్ని రేవుల నుంచి వే బిల్లులు లేకుండానే తరలిస్తున్న లారీలను పోలీసులు పట్టుకున్న దాఖలాలున్నాయి.
* కాళేశ్వరం పరిసర ప్రాంతాల్లోని రేవుల నుంచి ఇసుక తరలించేందుకు రోజుకు 2 వేల వరకు లారీలు వస్తుంటాయి. గమ్యస్థానాలకు త్వరగా వెళ్లే క్రమంలో అవి వేగంగా దూసుకెళ్తున్నందున అనేక మరణాలు సంభవించాయి. నాలుగేళ్లలో కనీసం 20 మందికి పైగానే మృత్యువాత పడ్డారు.
* సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌లో అక్రమ తవ్వకాలు సర్వసాధారణం. ఫొటోలు తీసి పోలీసులకు పంపిస్తున్నాడనే కోపంతో ట్రాక్టర్ల యజమానులు నెల రోజుల క్రితం ఓ వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు.
* సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ, మల్లాపూర్‌లో మధ్యమానేరు జలాశయం కింది ప్రాంతంలో ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. మాన్వాడకు చెందిన ఓ వ్యక్తి ఈ వ్యవహారంపై ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేయడం వల్ల రవాణాదారులు అతనిపై దాడికి పాల్పడ్డారు.
అడ్డుపడితే అంతే సంగతి
అధికారిక రేవుల్లోనూ ఓవర్‌లోడ్, నకిలీ బిల్లుల రూపంలో అక్రమాలు జరుగుతున్నాయనే విమర్శలున్నాయి. ఉపనదులు, వాగుల్లో మాత్రం స్థానిక అవసరాల పేరుతో ఒక రసీదుతో.. అందుకు నాలుగింతలు రవాణా అవుతోంది. ముఖ్యంగా రైతుల పట్టా భూముల్లో ఇసుక మేటల అమ్మకాలు మరిన్ని వివాదాలకు దారితీస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పట్టా భూముల్లో 199 రేవులు ఉన్నాయి. తమ పొలాల్లోంచి ఇసుక లారీలు, ట్రాక్టర్ల రాకపోకల్ని స్థానిక రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాలు పడిపోతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో గ్రామాల్లో గొడవలు జరుగుతున్నాయి.
ఇదీ చదవండి: పోరాడైనా కృష్ణా, గోదావరి జలాలను దక్కించుకుంటాం: కేసీఆర్