జీహెచ్‌ఎంసీ పాలకవర్గ ఎన్నికల్లో రెండు దశాబ్దాలుగా ఇద్దరు పిల్లల వరకు ఉన్నవారే పోటీ చేయాలనే నిబంధన అమలవుతోంది. కొత్త పురపాలకచట్టంలో రాష్ట్ర ప్రభుత్వం దీనిని సడలించింది. జీహెచ్‌ఎంసీ చట్టంలో ఇతర సవరణలతో పాటు ఈ ప్రతిపాదనను చేర్చారు. ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలున్న వారిని అనుమతిస్తే ప్రభుత్వంపై అనవసరమైన అపోహలు వస్తాయని ముఖ్యమంత్రి మంత్రిమండలిలో చర్చ సందర్భంగా సూచించారు.
ఈ నెల 13న జరిగే శాసనసభ సమావేశాల్లో చర్చలోనూ ఇదే విషయాన్ని తెలపాలని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ప్రస్తుత వార్డు రిజర్వేషన్లను కొనసాగించేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని సంప్రదించాకే ఈ ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికే పురపోరుకు సంబంధించి కొత్త పురపాలక చట్టంలో ఈ నిబంధన ఉండగా.. తాజాగా జీహెచ్‌ఎంసీ ముసాయిదా చట్ట సవరణ బిల్లులో ప్రతిపాదించారు.
మేయరు రిజర్వేషన్‌కు ఇది వర్తించదు
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 150 డివిజన్ల రిజర్వేషన్లను యథాతథంగా అమలు చేసేందుకు అధికారులు ప్రతిపాదించారు. దీనినుంచి మేయరు రిజర్వేషన్‌ను మినహాయించారు. ప్రస్తుతం బీసీ జనరల్ రిజర్వుడ్ కోటాలో బొంతు రామ్మోహన్ మేయరుగా ఉన్నారు. ఈఏడాది జనవరిలో రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని నగర పాలక సంస్థలకు రిజర్వేషన్లను ఖరారు చేయగా.. జీహెచ్‌ఎంసీ స్థానం జనరల్ మహిళ కేటగిరీకి ఎంపికైంది. ఈ రిజర్వేషన్ పదేళ్లు అమలులో ఉంటుందని ప్రభుత్వం మంత్రిమండలికి ప్రతిపాదించింది.
ముసాయిదా చట్ట సవరణ బిల్లులోని ఇతర ప్రతిపాదనలు
- సరిగా పనిచేయని స్థానిక ప్రజాప్రతినిధులను పదవుల నుంచి తొలగించాలనే నిబంధన పంచాయతీరాజ్, కొత్త పురపాలక చట్టాల్లో ఉండగా దీన్ని జీహెచ్‌ఎంసీకి వర్తింపజేయాలి.
- కొత్త పురపాలక చట్టంలో పురపాలక బడ్జెట్‌లో 10 శాతం నిధులను పచ్చదనం పరిరక్షణకు కేటాయించింది. హైదరాబాద్ నగరపాలక సంస్థకు సైతం దీనిని వర్తింపజేయాలి.
- హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)పరిధిలో సమీకృత టౌన్‌షిప్‌ల అభివృద్ధికి నిబంధనలను ఖరారు చేసింది. ఈ టౌన్‌షిప్‌లను ఓఆర్‌ఆర్‌కు 5 కిలోమీటర్ల బయటే అనుమతిస్తుంది. కనీసం 100 ఎకరాలు ఉండాలి.
- ధరణిలో ప్రజలు నమోదు చేసుకుంటున్న వ్యవసాయేతర ఆస్తులకు తెలంగాణ ఆస్తి గుర్తింపు సంఖ్య (ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ నంబరు)ను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
- వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు మార్చేందుకు అనుమతించే(నాలా) అధికారాలను రెవెన్యూడివిజినల్ అధికారుల నుంచి మినహాయిస్తూ తహసీల్దార్లకు అప్పగించాలి.
ఎల్‌ఆర్‌ఎస్ గడువు పొడిగించే అవకాశం
తెలంగాణ భూముల క్రమబద్ధీకరణ పథకాన్ని(ఎల్‌ఆర్‌ఎస్) పొడిగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెల 15 వరకే గడువు ఉంది. దీనికి మంచి స్పందన వస్తున్నందున మరికొన్ని రోజులు అవకాశం కల్పించేందుకు సర్కారు యోచిస్తోంది.