Saddula Bathukamma Festival in Telangana : రాష్ట్ర వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఊరూవాడా.. ఉయ్యాల పాటలతో మారుమోగాయి. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ మహిళలు ఆడిపాడారు. గాజుల చేతుల చప్పట్లతో.. వీధులన్ని మారుమోగాయి. హరివిల్లు నేలపై పరుచుకుందా అన్నట్లుగా.. మహిళలు, యువతుల కేరింతలతో ఊర్లన్నీ సందడిగా మారాయి. గౌరమ్మను కొలుస్తూ జరుపుకున్న సద్దుల బతుకమ్మ వేళ.. రాష్ట్రమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
సద్దుల బతుకమ్మ వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. తెలంగాణా సచివాలయం ఎదురుగా ఉన్న అమరుల స్మారక కేంద్రం వద్ద నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పాల్గొన్నారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖలు, జీహెచ్ఎంసీలు సద్దుల బతుకమ్మ ఉత్సవాలకు ఏర్పాట్లు చేశాయి. సద్దుల బతుకమ్మ వేడుకల్లో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
Bathukamma Celebrations in Warangal : తెలంగాణ సంస్కృతి సంప్రదాయలకు ప్రతీకగా నిలిచే.. బతుకమ్మ వేడుకలు ఆద్యంతం కన్నులపండువగా జరిగాయి. వరంగల్, హనుమకొండ జిల్లాల్లో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. హనుమకొండలోని పద్మాక్షి గుండం ప్రాంగణం ఆడపడుచులతో కిక్కిరిసిపోయింది. తీరొక్క పూలతో అందంగా తీర్దిదిద్దిన బతుకమ్మల చుట్టూ చేరి.. మహిళలు ఆడి పాడారు. ఉయ్యాల పాటలతో పరిసరాలు మారుమోగాయి.
సిద్దిపేటలోని కోమటి చెరువు వద్ద సద్దుల బతుకమ్మ సందడిగా సాగింది. మంత్రి హరీశ్‌రావు సతీమణి శ్రీనిత సిద్దిపేట పట్టణంలో పలు వీధులలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌లో ఆడపడుచులంతా కలిసి ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు.
Bathukamma Celebrations At Telangana Secretariat : నూతన సచివాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Saddula Bathukamma Celebrations in Medak : రంగు రంగుల పూలు.. బతుకమ్మ పాటలు.. నృత్యాలతో సద్దుల బతుకమ్మ వేడుకలు అన్ని జిల్లాల్లో అట్టహాసంగా జరిగాయి. తెలంగాణా సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే సద్దుల బతుకమ్మ వేడుకల్లో.. మహిళలు, చిన్నారులు బతుకమ్మ ఆడి పాడారు. గౌరమ్మను భక్తి శ్రద్ధలతో కొలిచారు. ఆడపడుచులు అత్యంత భక్తిశ్రద్ధలతో బతుకమ్మలు పేర్చి ఆటపాటలతో సందడి చేశారు.
తనివితీరా ఆటలు ఆడుకున్న మహిళలు.. అనంతరం బతుకమ్మను సాగనంపేందుకు చెరువులకు చేరుకున్నారు. బతుకమ్మలు నిమజ్జనం చేసేందుకు ఆయా చెరువుల దగ్గర అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. "పోయిరా బతుకమ్మ.. పోయి మళ్లీ రా బతుకమ్మ.." అంటూ.. సాగనంపారు. చెరువులు మొత్తం బతుకమ్మలతో మెరిసిపోయింది. ఆ తర్వాత.. చెరువు కట్టలపైన మహిళలంతా కూడి.. బతుకమ్మకు నైవేద్యంగా పెట్టిన రకరకాల ప్రసాదాలను ఒకరికొకరు పంచుకున్నారు. పసుపుబొట్లు పెట్టుకుంటూ.. సందడి చేశారు.