ఓబుళాపురం గనుల కేటాయింపులో ప్రతిపాదనల ఫైల్‌ను మంత్రిగా ఆమోదించడం తప్ప.. అందులోని ఇతర అంశాలతో తనకు సంబంధం లేదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైకోర్టుకు నివేదించారు. ఓఎంసీ కేసులో తన పేరు తొలగించాలని కోరుతూ వేసిన డిశ్చార్జ్ పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ.. సబితా ఇంద్రారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇవాళ విచారణ చేపట్టారు.
ఓఎంసీ ఛార్జ్‌షీట్‌లో సబితా ఇంద్రారెడ్డిని మొదట సాక్షిగా పేర్కొన్నారని.. ఆ తర్వాత ఎలాంటి ఆధారాలు చూపకుండానే నిందితురాలిగా చేర్చారని ఆమె తరఫున న్యాయవాది ఉమామహేశ్వరరావు వాదించారు. మంత్రి క్షేత్రస్థాయిలోకి వెళ్లి చూడరని.. కింది నుంచి వచ్చిన ఫైళ్లపై సంతకాలు చేస్తారని తెలిపారు. సీబీఐ కోర్టు తమ వాదనల్లో పలు అంశాలు పరిగణనలోకి తీసుకోలేదని న్యాయస్థానానికి వివరిచారు. దీనిపై వాదనలు విన్న ధర్మాసనం.. సబితా ఇంద్రారెడ్డి పిటిషన్‌పై తదుపరి విచారణను ఈనెల 17కి వాయిదా వేసింది. మరోవైపు ఓఎంసీ కేసు నుంచి తొలగించాలన్న పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ.. గనుల శాఖ మాజీ సంచాలకుడు వి.డి.రాజగోపాల్ వేసిన అప్పీలుపై ఇవాళ వాదనలు ముగియడంతో.. తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.
ఇవీ చదవండి: 'పోడు పట్టాలు సక్రమంగా ఇవ్వకుంటే పేదలు నీ ఫామ్‌హౌస్ దున్నడం ఖాయం'
'సన్నిహితులకు మేలు చేయడమే కాంగ్రెస్ సంస్కృతి.. మాది కాదు'.. ప్రతిపక్షాలపై నిర్మల ఫైర్