Dharna Chowk Protest: రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని జాతీయ రైతు హక్కుల కార్యకర్త కురుగంటి కవిత డిమాండ్ చేశారు. కుటుంబంలో రైతు చనిపోతే ఆ కుటుంబం జీవితాంతం అప్పులు కట్టుకోవడమేనా అని ఆమె ప్రశ్నించారు. చనిపోయిన రైతు చేసిన అప్పులను ప్రభుత్వం వన్‌టైం సెటిల్‌మెంట్ కింద తీర్చి ఆదుకోవాలని కోరారు. ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో రైతు ఆత్మహత్యల బాధితుల ప్రజావేదిక చేపట్టిన ధర్నా కార్యక్రమంలో కవిత కురుగంటి పాల్గొన్నారు.
జిల్లా కమిటీలు ఏర్పాటు చేయాలి..
2014 నుంచి ఆత్మహత్యలకు పాల్పడిన బాధిత రైతు కుటుంబాలకు సాయంతో పాటు భవిష్యత్‌లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జీవో 421 ప్రకారం ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని కవిత తెలిపారు. మహారాష్ట్ర తరహాలో జిల్లా కమిటీలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. మహిళా రైతులకు అప్పు, విషంలేని సేద్యాన్ని నేర్పించాలని కవిత తెలిపారు. త్వరలో సీఎం కేసీఆర్ గుణపాఠం నేర్చుకోబోతున్నారన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జాతీయ కన్వీనర్ వి సంధ్య, దళిత స్త్రీశక్తి కన్వీనర్ గడ్డం ఝాన్సీ, ప్రజాస్వామ్య హక్కుల కార్యకర్త ప్రొఫెసర్ హరగోపాల్, తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ తదితరులు పాల్గొన్నారు.
మహిళల కోసం పోరాడుతున్నాం..
మీ కోసమే పోరాడట్లేదు.. మీలాంటి వేరే మహిళల కోసం పోరాడుతున్నాం. మిమ్మల్ని బాధితురాలి కింది చూడం. మీరు చాలా శక్తివంతమైన మహిళలు.. మీకున్న శక్తిని ఇతర మహిళలకు కూడా ఇవ్వండి. కలిసి పోరాడితే తప్పకుండా సాధించగలం. ఎవరికైతే నిజంగా సాయం అవసరమో.. వారికి ఇవ్వడానికి మాత్రం తెరాస ప్రభుత్వం ముందుకు రాలేదు. -కురుగంటి కవిత, జాతీయ రైతు హక్కుల కార్యకర్త
కౌలురైతులకే ఇవ్వాలి..
సమాజం మనతో ఉన్నది అనుకున్నప్పుడు మనకు వచ్చే విశ్వాసం వేరు. బ్యాంకులను ప్రైవేట్ పరం చేస్తున్నరు. ఇప్పుడిస్తున్న ఈ కాస్త అప్పు కూడా దొరకదు. ప్రైవేట్ బ్యాంకు వాళ్లొస్తే.. వాళ్లు కూడా వ్యాపారస్తుని లాగానే ఉంటరు. రైతుబంధు అని ఇస్తున్నరు... భూమిని కౌలు రైతులు సాగు చేస్తుంటే.. డబ్బులేమో భూయజమానులకు పోతున్నాయి. కౌలుదారులకు.. ఎక్కడైతే భూమి మీద భూయజమాని లేడో అక్కడ కౌలు రైతులకే రైతుబంధు, మద్దతు ధర ఇచ్చే విధంగా మార్పు రావాలి. -ఆచార్య హరగోపాల్, సామాజిక కార్యకర్త
ఇదీ చదవండి:
chilli farmers suicides: అత్యంత దయనీయంగా మిర్చి రైతు పరిస్థితి.. వారంలో ముగ్గురు ఆత్మహత్య