రైతుబంధు సొమ్ము జమ చేయడానికి వ్యవసాయ, ఆర్థికశాఖలు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాయి. సోమవారం(రేపటి) నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు వేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తొలుత ఎకరాలోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో.. తర్వాత 2, 3, 4 ఎకరాల్లోపు వారికి సొమ్ము జమ చేస్తారు. ఎకరానికి రూ.5 వేల చొప్పున రైతు ఖాతాలో వేయాలన్నది ఈ పథకం నిబంధన. మొత్తం 59.32 లక్షల మంది రైతుల పేర్లు ఆన్‌లైన్‌లో ఉన్నట్లు రెవెన్యూ వర్గాలు తెలిపాయి.
వారికి మాత్రమే..
గత జులై 1 నుంచి ఈనెల 10 వరకూ భూములు కొన్న, కుటుంబాల్లో భూ పంపకాల వల్ల కొత్తగా పేర్లు నమోదైన 1.75 లక్షల మంది పేర్లను వ్యవసాయ విస్తరణ అధికారులు(ఏఈఓ) నమోదు చేశారు. బ్యాంకు, ఆధార్, పట్టాదారుపాసు పుస్తకం వివరాలు పక్కాగా ఉన్న వారి పేర్లకు మాత్రమే సొమ్ము జమ చేస్తామని వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి చెప్పారు.
పోస్టాఫీసులోనే..
కరోనా నేపథ్యంలో ఈ సీజన్ నుంచి వ్యవసాయశాఖ కొత్త ప్రయోగం చేస్తోంది. రైతు బ్యాంకు ఖాతాలో సొమ్ము జమ కాగానే అతని సెల్‌ఫోన్‌కు సందేశం వస్తుంది. వెంటనే ఆధార్, బ్యాంకు పాసుపుస్తకం తీసుకుని సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్లితే రైతుకు సొమ్ము ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనివల్ల బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం ఉండదని అధికార వర్గాలు తెలిపాయి. పాస్తుపుస్తకాలు ఇంతవరకూ రాని రైతులకు రైతుబంధు అందే అవకాశం లేదు.
ఇదీ చూడండి: ఎల్ఆర్ఎస్ భవిష్యత్ కార్యాచరణ ఏమిటి?