Rythu Bandhu Funds: రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం నగదు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమవుతోంది. ఈ ఏడాది యాసంగి సీజన్‌కు సంబంధించి ఏడవ రోజు రైతుల ఖాతాల్లో 201.91 కోట్ల రూపాయలు జమయ్యాయి. 65,269 మంది రైతుల ఖాతాలకు రైతుబంధు నిధులు బదిలీ అయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 60,16,697 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 6008.27 కోట్ల రూపాయలు వ్యవసాయ శాఖ జమ చేసింది.
దేశంలో రైతులకు చేయూతనిచ్చిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ప్రతిష్ఠాత్మక రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్ వంటి పథకాలు వ్యవసాయ రంగానికి ఊపిరి పోశాయని తెలిపారు. గతంలో ప్రభుత్వాల సహకారం లేక వ్యవసాయానికి దూరమైన రైతన్నలకు ఆత్మస్థైర్యం నింపాయని సంతోషం వ్యక్తం చేశారు. సమైక్య పాలనలో ఇతర రంగాల్లో ఉపాధి వెతుక్కున్న రైతులు తిరిగి కీలక వ్యవసాయ రంగం వైపు మళ్లారని చెప్పుకొచ్చారు. ఈ ఘనత, ఈ భరోసా ముఖ్యమంత్రి కేసీఆర్ కల్పించిందేనని... అందుకే ఊరూరా రైతుబంధు సంబరాల్లో రైతులు కేసీఆర్‌కు నీరాజనాలు పడుతున్నారని తెలిపారు. తెలంగాణ వ్యవసాయ రంగాన్ని దేశానికి ఆదర్శంగా నిలపడమే కేసీఆర్ ఆకాంక్ష అని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి మార్గనిర్దేశంలో.. రాష్ట్ర వ్యవసాయ శాఖ స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు సాగుతోందని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'ప్రభుత్వ విజయ కిరీటంలో వ్యవసాయ శాఖ పాత్ర వజ్రంలాంటిది'