రాష్ట్రంలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పలువురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానానికి తెరాస అభ్యర్థి సురభి వాణీదేవి.. నామినేషన్ దాఖలు చేశారు. ఈమె వెంట.. పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎంపీ కేకే వచ్చారు. ఉదయం తండ్రి, మాజీ ప్రధాని పీవీ ఘాట్‌వద్ద అంజలి ఘటించిన వాణీదేవి.. తర్వాత ముఖ్యమంత్రిని కలిసి బీ-ఫారాన్ని అందుకున్నారు. అక్కడి నుంచి గన్‌పార్క్ వద్దకు వెళ్లి.. అమరవీరులకు నివాళులర్పించారు. పార్టీలకతీతంగా వాణీదేవిని ఏకగ్రీవంగా ఎన్నుకునేలా ఇతర పార్టీల నేతలు సహకరించాలని మంత్రి తలసాని కోరారు.
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానానికి భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచందర్‌రావు.. నిజామాబాద్ ఎంపీ అర్వింద్, సీనియర్ నేత పేరాల శేఖర్‌జీ వెంటరాగా బల్దియా ప్రధానకార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంటామని కమలం నేతలు ధీమావ్యక్తం చేశారు. ఇదే స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి తరపున.. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇతర సీనియర్ నేతలు మల్లురవి, కుసుమకుమార్, అంజన్‌కుమార్ యాదవ్ నామినేషన్ పత్రాలు సమర్పించారు.
ప్రజలకు అందుబాటులో లేని పార్టీలకు ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలని పట్టభద్రులను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కోరారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఆ పార్టీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి నామపత్రాలు దాఖలు చేసే కార్యక్రమానికి సంజయ్ హాజరయ్యారు. ఇదే స్థానానికి తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరకు సుధాకర్, యువ తెలంగాణ పార్టీ అభ్యర్థి రాణి రుద్రమదేవి, స్వతంత్ర అభ్యర్థులు తీన్మార్ మల్లన్న, సుదగాని హరిశంకర్ తదితరులు తమ నామినేషన్లు దాఖలుచేశారు.
మొత్తం 81 నామినేషన్లు
మహబూబ్‌నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఈరోజు 38 నామినేషన్ పత్రాలు సమర్పించారని ఎన్నికల అధికారి ప్రియాంక అల తెలిపారు. ఇప్పటి వరకు ఈ స్థానానికి మొత్తం 81 నామినేషన్లు దాఖలయ్యాయని ఆమె వివరించారు. రేపటితో పట్టభద్రుల ఎమ్మెల్సీ నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుంది. 24న నామినేషన్ల పరిశీలన జరగనుంది. 26 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడవుగా నిర్ణయించారు. మార్చి 14న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 17న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు చేపడతారు.
ఇదీ చూడండి: వాళ్లకు ఓటుతో గుణపాఠం చెబుదాం: బండి సంజయ్