Funds For Kaleshwaram : కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్ర జలశక్తిశాఖ జారీ చేసిన గెజిట్ ప్రభావం.. రాష్ట్రంలోని నిర్మాణంలో ఉన్న, అనుమతుల్లేని ప్రాజెక్టులపై పడింది. అనుమతుల్లేని ప్రాజెక్టులకు జనవరి14లోగా అనుమతులు తెచ్చుకోవాలని గెజిట్‌లో కేంద్రం పేర్కొంది. అందుకనుగుణంగా ఆయా ప్రాజెక్టులకు అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ ప్రక్రియ ప్రస్తుతం వివిధ దశల్లో ఉంది. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న పలు ప్రాజెక్టులకు ప్రభుత్వం వివిధ బ్యాంకులు, సంస్థల నుంచి రుణాల ద్వారా నిధులు సమీకరిస్తోంది. మరోవైపు అనుమతుల్లేని ప్రాజెక్టుల పనులను జనవరి 14 తర్వాత నిలిపివేయాలని గెజిట్‌లో కేంద్రం తెలిపింది. దీంతో ఆయా ప్రాజెక్టులకు రుణాలు ఇచ్చే సంస్థలు వాటిని నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ జనవరి 14కు ముందు పూర్తయిన పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల కోసం నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆయా సంస్థలను కోరింది. ఆ ప్రయత్నంలోనే కాళేశ్వరం అదనపు టీఎంసీ నిధులకు మార్గం సుగమమైంది.
జనవరి 14కు ముందు పూర్తయిన పనులకు నిధులు ఇవ్వాలని ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు రూ.572 కోట్ల విడుదలకు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ) అంగీకారం తెలిపింది. దీంతో ఆ ప్రాజెక్టు పనులకు నిధుల అంశంలో ప్రభుత్వానికి కొంత ఉపశమనం కలిగింది. అటు అనుమతుల్లేని ప్రాజెక్టులకు సంబంధించిన గడువు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. సంగారెడ్డి జిల్లాలో తలపెట్టిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు నిధుల సమీకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. రెండు ప్రాజెక్టులకు నిధుల కోసం మంజీరా లిఫ్ట్ ఇరిగేషన్ కార్పొరేషన్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపింది. సంగారెడ్డి చీఫ్ ఇంజినీర్‌ని కార్పొరేషన్‌కు ఎండీగా నియమించింది. దీని ద్వారా నాబార్డ్ నుంచి సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలకు నిధులు సమకూర్చుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ఇదీ చూడండి : KRMB Letter: శ్రీశైలం జలాశయంలో విద్యుదుత్పత్తి ఆపండి: కృష్ణా బోర్డు