ఆంధ్రప్రదేశ్ శాసన మండలి నిబంధనల్లోనిదే రూల్ 71. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాన్ని వ్యతిరేకించే అధికారాన్ని రూల్ 71.. శాసన మండలి సభ్యులకు ఇస్తుంది. అది ఎలాంటి నిర్ణయమైనా.. శాసనసభలో ఆమోదం పొందినా సరే.. మండలి సభ్యులు తీర్మానం పెట్టి.. వ్యతిరేకించే అధికారం ఉంది. ఏ పార్టీ సభ్యుడెనా ఈ రూల్‌ను లేవనెత్తవచ్చు.
ముందస్తు అనుమతి తప్పనిసరి
అయితే ఇందులో ఇంకో విషయం ఉంది. సభా ప్రారంభం కావడానికి ముందే.. ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు మండలి ఛైర్మన్ అనుమతి కోరాలి. సంబంధిత సభ్యుడు తీర్మానాన్ని లిఖితపూర్వక నోటీసు రూపంలో శాసనమండలి కార్యదర్శికి అందజేయాలి. ఆ నోటీసు నిబంధనలకు అనుగుణంగా ఉందో.. లేదో.. ఛైర్మన్ పరిశీలించి... చదివి వినిపిస్తారు. దీనికి మద్దతిచ్చే సభ్యులు తమ తమ స్థానాల్లో లేచి నిలబడాలి.
కనీసం 20 మంది సభ్యులు
రూల్ 71 అంశానికి అనుగుణంగా చర్చ జరగాలంటే.. 20మంది లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులు అనుకూలంగా ఉంటే చర్చకు అవకాశమివ్వాలి. తీర్మానం నోటీసులో కోరిన తేదీ నుంచి ఏడు పని దినాల్లోపు ఏదో ఒకరోజు మండలి ఛైర్మన్ చర్చకు అనుమతించాలి. తీర్మానానికి అనుకూలంగా కనీసం 20 మంది సభ్యులు లేచి నిల్చొకపోతే.. ఆ తీర్మానం నోటీసు చెల్లదని ఛైర్మన్ ప్రకటిస్తారు.
ఇదీ చదవండి:'తెరాస ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది'