ఆర్టీసీ సమ్మెపై విచారణ పూర్తి చేసిన ఉన్నత న్యాయస్థానం... సమస్యను పరిష్కరించాలని కార్మికశాఖను ఆదేశించింది. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఆర్టీసీ సమ్మె వ్యవహారం కార్మిక శాఖ చేతుల్లోకి వెళ్లనుంది. కార్మిక చట్టాల ప్రకారం చర్చల ప్రక్రియ ముగిశాక ఏడు రోజుల తర్వాత సమ్మెకు వెళ్లాల్సి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఆర్టీసీ సంఘాలు అందుకు విరుద్ధంగా వ్యవహరించాయని తెలిపాయి.
నివేదిక పట్టించుకోకండి...
అక్టోబర్ 4న కార్మిక శాఖ సంయుక్త కమిషనర్ సమక్షంలో చర్చలు జరిగాయి. ఆ మరుసటి రోజే అంటే 5 అర్ధరాత్రి నుంచే సమ్మెలోకి వెళ్లాయి. చర్చల ప్రక్రియ ముగియకుండానే సమ్మెకు వెళ్లినందున సమ్మె చట్టవిరుద్ధమైనది కార్మికశాఖ సంయుక్త కమిషనర్ అప్పట్లో ప్రకటించారు. హైకోర్టులో విచారణ సందర్భంగా ఈ అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. సంయుక్త కమిషనర్ ఇచ్చిన నివేదికను పట్టించుకోవద్దని న్యాయస్థానం సూచించింది.
15 రోజుల్లో...
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో జరిగిన చర్చల పూర్తి సారాంశాన్ని వివరిస్తూ.. 15 రోజుల్లో కార్మిక న్యాయస్థానానికి నివేదించాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ వ్యవహారాన్ని కార్మిక న్యాయస్థానానికి నివేదిస్తామని కార్మిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. కార్మిక చట్టాలను అనుసరించి ఆరు నెలల్లోగా సమస్యను పరిష్కరించాల్సి ఉంటుంది. కార్మిక శాఖ కమిషనర్ ఇచ్చే నివేదికపై కార్మికులు, ఆర్టీసీ యాజమాన్య వర్గాల వాదనలు విన్న తరువాత సమ్మె సక్రమమా కాదా అన్న అంశాన్ని కార్మిక న్యాయస్థానం తేలుస్తుంది.
సక్రమమైతే జీతాలు...
సమ్మె సక్రమమైతే సమ్మె కాలానికి జీతభత్యాలు ఇవ్వాలని చెప్పే అవకాశం ఉందంటున్నారు. అదే సమ్మె అక్రమమని ప్రకటిస్తే కార్మికులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని అదేశించే అవకాశం ఉందని తెలుస్తోంది. సమ్మె కాలానికి జీతాలు చెల్లించకపోగా, గరిష్ఠంగా 8 రోజుల జీతం వరకు కోత విధించాలని ఆదేశించే అవకాశం ఉందని అంటున్నారు. సమ్మె అక్రమమని కార్మిక న్యాయస్థానం నిర్ధరిస్తే సర్వీసు నిబంధనల ప్రకారం కార్మికులపై చర్యలు తీసుకునే విచక్షణాధికారం యాజమాన్యానికి ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యే వరకు చాలా సమయం పట్టొచ్చని భావిస్తున్నారు.
ఇవీ చూడండి: సీఎం గారూ ఆర్టీసీ కార్మికులను చేర్చుకోండి: పవన్ కల్యాణ్