తెలంగాణ ఆర్టీసీ కార్గో సేవల్లోని పార్శిల్ బుకింగ్ కేంద్రాల్లో కొన్నింటిని అవుట్‌సోర్సింగ్‌కు ఇచ్చే యోచనలో ఉంది. కార్గో సేవల్లో మానవ అవసరాలపై అధ్యాయనం చేసి... ప్రస్తుతం ఏ మేరకు ఉన్నాయి? భవిష్యత్తులో ఏ మేరకు అవసరమవుతాయనే అంశంపై అధ్యాయనం చేయాలని అధికారులు నిర్ణయించారు. కరోనాతో బస్సుల సంఖ్య తగ్గించటంతో అప్పట్లో ఎక్కువ మందిని దీనికి కేటాయించింది. ప్రస్తుతం హైదరాబాద్ మినహా మిగిలిన మార్గాల్లో సర్వీసుల సంఖ్య పెరుగుతుండటంతో సిబ్బంది అవసరం ఏర్పడుతుందని అధికారులు అధ్యయనం చేపట్టినట్లు సమాచారం.
ఖర్చులు కలిసి వస్తాయి..
రోజూ వంద లోపు బుక్ చేస్తున్న కేంద్రాల్లో కొన్నింటిని అవుట్‌సోర్సింగ్ విధానంలో నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఛార్జీలు వసూలు చేయటంతోపాటు పర్యవేక్షణకు మాత్రం సిబ్బందిని వినియోగించాలని ఆర్టీసీ భావిస్తోంది. దీనివల్ల సిబ్బందిని తగ్గించవచ్చని, ఖర్చులు కలిసొస్తాయనే అభిప్రాయం అధికారుల్లో వ్యక్తం అవుతోంది. అలాగే కార్గో వ్యవస్థ అంతటినీ కంప్యూటరీకరించేందుకు అధికారులు శ్రీకారం చుట్టారు. తొలిదశలో 54 కేంద్రాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు.
బస్సులకు జీపీఎస్
బుక్ చేసిన పార్శిల్ ఎక్కడ ఉందో వినియోగదారులు తెలుసుకునేందుకు ట్రాకింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలని ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. బస్సులను జీపీఎస్ వ్యవస్థతో అనుసంధానం చేయటం ద్వారా ట్రాకింగ్‌ను కార్యరూపంలోకి తీసుకురావాలని నిర్ణయించింది. దశలవారీగా చేపట్టనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రక్రియను చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. తొలిదశలో రెండు నుంచి మూడు వేల బస్సులను అనుసంధానం చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు ఆర్టీసీ అధికారి తెలిపారు.
అంతర్జాతీయ పార్శిల్‌లోకి అడుగు!
తెలంగాణ ఆర్టీసీ అంతర్జాతీయ పార్శిల్(కొరియర్) సేవల్లోకి అడుగిడనుంది. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు బస్సుల ద్వారా కార్గో, పార్శిల్ సేవలను అందిస్తున్న ఈ సంస్థ.. ఇక నుంచి విదేశాలకు సైతం సేవలను విస్తరించడానికి రంగం సిద్ధం చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నిత్యం పెద్ద సంఖ్యలో దుబాయ్, సింగపూర్, మలేసియా, అమెరికా, బ్రిటన్, కెనడా, న్యూజిలాండ్ తదితర దేశాలకు వివిధ రకాల పార్శిళ్లు వెళ్తుంటాయి. ఇక్కడి వారు ప్రత్యేకంగా ఆయా దేశాల్లో ఉంటున్న తమ కుటుంబసభ్యులకు పచ్చళ్లు, పప్పులు, తినుబండారాలు, ఇతర వస్తువులను పంపిస్తుంటారు. వాటితోపాటు మామిడి పళ్లు, అరటి పళ్లు, జామ, డ్రాగన్ ఫ్రూట్స్, కరివేపాకు, తమలపాకులు తదితర వ్యవసాయ ఉత్పత్తులు కూడా పెద్ద మొత్తంలో విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకున్న ఆర్టీసీ అధికారులు.. వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేసేందుకు వ్యవసాయ, ఉద్యాన శాఖలతో సంప్రదింపులు జరుపుతున్నారు.
విమానాశ్రయంలో కార్యాలయం
పార్శిల్ సర్వీసులను నిర్వహించేందుకు వీలుగా ఆర్టీసీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు జీఎమ్మార్ సంస్థ.. అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాంగణంలో స్థలాన్ని కేటాయించింది. ఈ మేరకు రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది.
ఇదీ చూడండి: అబ్కారీ శాఖలో పదోన్నతులు, బదిలీలు మరింత జాప్యం