Sajjanar about Medaram special buses : భక్తుల సౌలభ్యం కోసమే మేడారం జాతరకు స్పెషల్ బస్సులు ఏర్పాటు చేశామని.. లాభాపేక్ష కోణంలో కాదని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. జాతరకు 2020లో 3600 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయగా... ఈ ఏడాది ఆ సంఖ్యను పెంచుతున్నామని వెల్లడించారు. సామాజిక కోణం, భక్తుల సౌలభ్యం కోసం ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని స్పష్టం చేశారు.
స్పెషల్ బస్సులు 1968 నుంచే..
మేడారం జాతర కోసం 50 ఏళ్ల నుంచి ఆర్టీసీ సేవలు అందిస్తోందని ఆయన తెలిపారు. 1968లో 100 బస్సులతో ఈ సేవలు మొదలయ్యాయని చెప్పారు. 2020లో 3,382 బస్సుల్లో 50,230 ట్రిప్పులతో 19 లక్షల మందిని జాతరకు చేరవేశామని వెల్లడించారు. ఈ ఏడాది 3,845 బస్సులను నడిపిస్తున్నామన్న సజ్జనార్... సుమారు 23లక్షల మందిని మేడారం జాతరకు చేర్చాలని అంచనా వేస్తున్నామని వివరించారు.
51 పాయింట్ల నుంచి బస్సులను నడుపుతాం. బయటి రాష్ట్రాల నుంచి 45 బస్సులు అందుబాటులో ఉంటాయి. 30 మంది ప్రయాణికులు ఉంటే... వాళ్ళ కాలనీకే బస్సులు వస్తాయి. అవసరమైన వారు 040-30102829 నంబర్‌కు ఫోన్ చేయవచ్చు. ఇప్పటికే 523 బస్సులు అందుబాటులో ఉన్నాయి. 1250 ట్రిప్పుల ద్వారా 1.50 లక్షల మంది ప్రయాణించారు. 11నుంచి 20వ తేదీవరకు ప్రత్యేక బస్సులను నడుపుతాం.
-సజ్జనార్, ఆర్టీసీ ఎండీ
ప్రధాన నగరాల నుంచి ప్రత్యేక బస్సులు
50 ఎకరాల్లో బేస్ క్యాంపు, 42 క్యూ లైన్స్, 7,400 మీటర్ల క్యూ లైన్... ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని చెప్పారు. 100కు పైగా సీసీటీవీలను ఏర్పాటు చేశామన్న సజ్జనార్... బేస్ క్యాంప్ వద్ద ఒక అంబులెన్స్, ఐసీయూ కేంద్రం కూడా అందుబాటులో ఉంటాయన్నారు. వరంగల్ నుంచి 2,250 కండక్టర్లు లేని బస్సులను... ఖమ్మం, మెదక్, కరీంనగర్, హైదరాబాద్ నుంచి కూడా బస్సులను నడుపుతామని వివరించారు.
ప్రైవేటు వాహనాల పార్కింగ్ స్థలం నుంచి 30 ఫ్రీ షటిల్ బస్సులను ఏర్పాటుచేశాం. 11మొబైల్ మెకానికల్ టీమ్స్ ఏర్పాటుచేశాం. ప్రయాణికుల కోసం ప్రత్యేక వెబ్సైట్ మేడారం విత్ టీఎస్ ఆర్టీసీ ఏర్పాటు చేశాం. కిట్స్ కళాశాలకు చెందిన విద్యార్థులు...నెలపాటు కృషిచేసి ఈ యాప్‌ను తయారుచేశారు.
-సజ్జనార్, ఆర్టీసీ ఎండీ
ఇవీ చదవండి: