జులై 18 నాటికీ ఆర్టీసీ(RTC) ఉద్యోగులకు ఈ నెల వేతనాలు అందలేదని ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ హన్మంత్ (RTC JAC) తెలిపారు. ఫలితంగా 29 డిపోలు, వర్క్ షాపులు, ఆర్టీసీ(RTC) ప్రధాన కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 23వేల మంది సిబ్బందికి వేతనాలు ఇవ్వలేదని... మొదటిసారిగా ఆర్టీసీలో రెండు విడతలుగా వేతనాలు ఇస్తున్నారని అన్నారు.
కరీంనగర్, హైదరాబాద్ జోన్లలోని సిబ్బందికి ఈనెల 16న వేతనాలు ఇచ్చారన్నారు. గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లోని 29 డిపోల్లో ఇప్పటి వరకు వేతనాలు ఇవ్వలేదని తెలిపారు. జీతాలు సమయానికి రాకపోవడంతో... కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తక్షణమే వేతనాలు అందించాలని డిమాండ్ చేశారు.
'ఆర్టీసీ ఉద్యోగులు కష్టపడి పనిచేస్తున్నారు. విరామం లేకుండా 16 గంటలు పనిచేసినా గుర్తించకపోవడం బాధాకరం. జులై 18 నాటికీ వేతనాలు ఇవ్వలేదు. జీతాలను విడుతల వారీగా అందించడం గమనార్హం. మొదటి తేదీనే వేతనాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. కరోనా సమయంలో జీతాలు సరిగా రాకపోతే ఊరుకున్నాం. ఇప్పుడెందుకు ఆలస్యమవుతోంది?. ఆర్టీసీ పట్ల ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? సరైన సమయంలో జీతాలు రాక సిబ్బంది చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఆర్టీసీ కార్మికులకు తక్షణమే వేతనాలు అందించాలి.'
-హన్మంత్, ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్
ఇదీ చదవండి: Etela Rajender: భాజపా నేత ఈటల రాజేందర్ పాదయాత్ర ప్రారంభం