కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వం లాక్డౌన్ అమలు చేస్తోంది. ఈ లాక్డౌన్ ఇప్పటికే పీకల్లోతు నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి శాపంగా మారింది. కేవలం నాలుగు గంటలు మాత్రమే బస్సులు తిరగడానికి అనుమతి ఉండటంతో ఆదాయం భారీగా పడిపోయింది.
గత నెలలో రూ.4 కోట్ల ఆదాయం
ఈ ఏడాది జనవరి-ఫిబ్రవరి మాసంలో ఆర్టీసీ 8 వేల పైచిలుకు బస్సులను నడిపించటంతో రోజుకు రూ.13 కోట్ల ఆదాయం సమకూరింది. కరోనా రెండో దశ వేగంగా విస్తరించటంతో ప్రభుత్వం రాత్రి వేళల్లో కర్ఫ్యూ అమలు చేసింది. దీంతో ఏప్రిల్ మాసంలో రూ.4 కోట్ల మేర ఆదాయం పడిపోయింది. లాక్డౌన్ విధించటంతో ఒక్కసారిగా బస్సుల సంఖ్యను కుదించారు.
భారీగా తగ్గిన ఆదాయం
దీంతో ఆదాయం రూ.50-రూ.60 లక్షలకు తగ్గిపోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గ్రేటర్ పరిధిలో గతంలో 2,700 పైచిలుకు బస్సులు నడిచేవి. రాత్రి కర్ఫ్యూ విధించటంతో 1700 బస్సులు మాత్రమే నడిచాయి. తాజాగా లాక్డౌన్తో 600 సిటీ బస్సులు మాత్రమే తిప్పారు.
గ్రేటర్లో 450 బస్సులు మాత్రమే
ఇందులో జీహెచ్ఎంసీ, వైద్య సిబ్బందికి 150 బస్సులను తిప్పుతున్నారు. ఇవిపోను గ్రేటర్లో కేవలం 450 బస్సులను నాలుగు గంటలపాటు తిప్పుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే నష్టాల్లో కొనసాగుతున్న సంస్థకు లాక్డౌన్ మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైందని అధికారులు, కార్మిక సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఆ రాష్ట్రాల్లో 67శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి