బతుకమ్మ, దసరా ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ఎంజీబీఎస్, సీబీఎస్, జూబ్లీ బస్‌స్టేషన్ సహా హైదరాబాద్‌లోని ముఖ్య ప్రాంతాల నుంచి బస్సుల సర్వీసులు నడిపిస్తామని రంగారెడ్డి జిల్లా రీజినల్ మేనేజర్ వరప్రసాద్ వెల్లడించారు. 4 వేల 933 ప్రత్యేక బస్సులో ఏపీలోని ముఖ్యప్రాంతాలకు 964 బస్సులు, మిగిలిన వాటిని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు నడుపుతామని తెలిపారు. ప్రత్యేక బస్సులకు ఒకటిన్నరరేటు అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు స్పష్టంచేశారు.
నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల బస్సులు జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి నడపనున్నారు. ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచి వరంగల్, యాదగిరిగుట్ట వైపు వెళ్లే బస్సులు బయల్దేతాయి. సీబీఎస్ నుంచి రాయలసీమ వైపు బస్సులు నడుస్తాయి. దిల్‌సుఖ్‌నగర్ నుంచి నల్గొండ వైపు వెళ్లే బస్సులు నడుపుతున్నామన్నారు. ఖమ్మం వైపు వెళ్లే బస్సులు ఎంజీబీఎస్ నుంచి నడుపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం మే ఐ హెల్ప్ యూ, విచారణ కేంద్రాలను, ఆర్టీసీ అధికారులను అందుబాటులో ఉంచామన్నారు.
ప్రయాణికులు రద్దీ పెరిగితే అందుకు అనుగుణంగా మరిన్ని బస్సులను పెంచుతామని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.
ఇవీచూడండి: భాగ్యనగరంలో భారీవర్షం.. రోడ్లన్నీ జలమయం