భాగ్యనగరంలో రహదారుల అనుసంధానం ప్రక్రియ వేగంగా సాగుతోంది. ప్రభుత్వం నిధుల కొరత లేకుండా తోడ్పాటు అందిస్తోంది. ఫలితంగా తక్కువ సమయంలోనే 10 లింకు రోడ్ల నిర్మాణం పూర్తయింది. అభివృద్ధి చేయతలపెట్టిన 44.7 కి.మీ. పరిధిలోని 37 మార్గాల్లో మరో 18 రోడ్ల విస్తరణ పురోగతిలో ఉంది. పనులు వేగంగా జరుగుతున్నాయని యంత్రాంగం చెబుతోంది.
నగరంలో 9,100 కి.మీ. రోడ్డు మార్గాలున్నాయి. నిత్యం ట్రాఫిక్ సమస్యలే. సమస్యను పరిష్కరించేందుకు జీహెచ్‌ఎంసీ రూ.వేల కోట్లతో పైవంతెనలు, అండర్‌పాస్‌లు నిర్మిస్తోంది. రూ.2వేల కోట్ల విలువైన అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరాయి. ప్రభుత్వ ఆదేశాలతో లింకు రోడ్లను అభివృద్ధి చేస్తున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. రెండు ప్రధాన రహదారులను అనుసంధానం చేసే అంతర్గత రోడ్లను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఇప్పటి వరకు భూసేకరణలో తీసుకున్న ఆస్తులకు రూ.500కోట్ల విలువైన టీడీఆర్(భూ అభివృద్ధి బదలాయింపు హక్కు)లు జారీ చేశామని గుర్తుచేశారు. జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్ రహదారుల అభివృద్ధి సంస్థ(హెచ్‌ఆర్‌డీసీఎల్) ఉమ్మడిగా నిర్మాణ పనులను ముందుకు తీసుకెళ్తున్నాయి.
- ఇదీ చూడండి : ఆర్థిక ఇబ్బందులు తాళలేక బిడ్డను అమ్ముకున్న తల్లి