Road Works: అనూహ్యంగా పెరుగుతున్న తారు ధరలతో రాష్ట్రంలోని పలు జాతీయ రహదారుల వార్షిక నిర్వహణ భారంగా మారింది. ఒప్పంద సమయానికి తక్కువగా ఉండి పనుల సమయానికి తారు ధరలు హెచ్చడంతో గుత్తేదారులు పనులు చేపట్టడంలేదు. పనులు ఏవైనా ఒకే తరహా నిబంధనను కేంద్రం అమలు చేయకపోవటంతోనే చిక్కులు వస్తున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల ఆధారంగా ప్రతి 15 రోజులకు ఒకసారి చమురు సంస్థలు తారు ధరలను మారుస్తుంటాయి. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ధరల వ్యత్యాసం నిబంధనల మేరకు తారు, సిమెంటు ధరలను పరిగణనలోకి తీసుకుని గుత్తేదారులకు చెల్లింపులు చేసే విధానం ఉంది. చిన్న, పెద్ద అనే వ్యత్యాసం లేకుండా అన్ని రకాల పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఆ నిబంధనను అమలు చేస్తుంది. రూ.5 కోట్ల నుంచి రూ.20 కోట్ల వ్యయంతో చేపట్టే ఏడాదిలోపు పూర్తి చేయాల్సిన పనులకు మాత్రం కేంద్రం ఒప్పందం నాటి ధరలనే చెల్లిస్తోంది.
పెరిగిన ధరలను ఒకేలా...
ఏడాది పైబడిన అధిక విలువ గల పనులకు పెరిగిన ధరలను కేంద్రం కాంట్రాక్టర్లకు ఇస్తోంది. దీనిని సరిచేయాలని..అన్ని రకాల పనులకు పెరిగిన ధరలను ఒకేలా వర్తింపజేయాలంటూ వినతి పత్రాలు ఇచ్చినా కేంద్రం పట్టించుకోవటం లేదని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బాయ్) తెలంగాణ శాఖ ఆవేదన వ్యక్తం చేస్తోంది. రూ.20 కోట్ల లోపు వ్యయంతో చేపట్టే నిర్వహణ పనుల్లోనూ తారు అవసరం 50 - 70 శాతం ఉంటుందని అధికారులు అంగీకరిస్తున్నారు.
తారు ధరలు అనూహ్యంగా పెరగటంతో అధిక ధరలకు దక్కించుకున్న గుత్తేదారులు పనులను నత్తనడక సాగిస్తున్నారు. తక్కువ మొత్తానికి టెండరు దక్కించుకున్న గుత్తేదారులు చేతులెత్తేస్తున్నారు. పర్యవసానంగా గుంతల రహదారులపై ప్రయాణికులకు అవస్థలు తప్పడంలేదు.
నిలిచిన, నత్తనడకనసాగుతున్న పనులు...
* జగిత్యాల-కరీంనగర్-వరంగల్-ఖమ్మం మార్గంలో రూ.16.5 కోట్లతో రహదారుల నిర్వహణ పనులకు గుత్తేదారులతో అధికారులు ఒప్పందం చేసుకున్నారు. ఆ సమయానికి టన్ను తారు రూ.30వేల లోపుండగా ప్రస్తుతం రూ.50వేలకు దగ్గరలో ఉంది. వ్యయం పెరగటంతో గుత్తేదారు పనులను నిలిపేశారు.
* ఖమ్మం-అశ్వారావుపేట మార్గంలో రూ. 11 కోట్ల వార్షిక నిర్వహణ పనులకు గుత్తేదారులతో ఒప్పందం చేసుకున్నారు. తారు ధర గణనీయంగా పెరగటంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి.
* హైదరాబాద్-భూపాలపట్నం మార్గంలో వరంగల్ బైపాస్ పరిధిలో ఈపీసీ ప్రాతిపదికన పనులు మంజూరు చేశారు. పెరిగిన ధరల నేపథ్యంలో కాంట్రాక్టరు కార్యకలాపాలు ఆపేశారు. రాష్ట్రంలో మరికొన్న చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉందని అధికారులు, గుత్తేదారులూ పేర్కొంటున్నారు.
ఇదీ చూడండి: