కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల (Krishna, Godavari River Boards) పరిధిని ఖరారు చేస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణ కోసం సమన్వయ కమిటీలు ఇవాళ సమావేశమయ్యాయి. కేఆర్ఎంబీ (Krmb), జీఆర్ఎంబీ (Grmb) సమన్వయ కమిటీల ఉమ్మడి సమావేశం హైదరాబాద్ జలసౌధ (Jalasoudha)లో జరిగింది. గోదావరి, కృష్ణా బోర్డుల సభ్య కార్యదర్శులు పాండే, రాయిపురే నేతృత్వంలో జరిగిన సమావేశంలో బోర్డుల సభ్యులు, కేంద్ర జలశక్తి శాఖ ప్రతినిధులు, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ఈఎన్సీలు మురళీధర్, సతీశ్, ట్రాన్స్ కో, జెన్కో సీఎండీలు శ్రీకాంత్, శ్రీధర్ పాల్గొన్నారు.
తెలంగాణ గైర్హాజరు...
తెలంగాణ నుంచి ఎవరూ సమావేశానికి హాజరు కాలేదు. సమన్వయ కమిటీ సమావేశాలకు ముందే పూర్తి స్థాయి బోర్డును సమావేశపర్చాలని తెలంగాణ కోరుతోంది. ఈ మేరకు సోమవారం గోదావరి బోర్డు ఛైర్మన్‌కు లేఖ రాసిన తెలంగాణ ఈఎన్సీ మురళీధర్... ఇవాళ సమావేశానికి ముందు కృష్ణా బోర్డు ఛైర్మన్‌కు కూడా లేఖ రాశారు. కీలకమైన అంశాలపై పూర్తి స్థాయి బోర్డు సమావేశంలో చర్చించాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాతే సమన్వయ కమిటీని సమావేశపర్చాలని కోరారు. ముందు నిర్ణయించిన ప్రకారం కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీలు సమన్వయ కమిటీ సమావేశాన్ని కొనసాగించాయి. దీంతో తెలంగాణ సభ్యులు గైర్హాజరయ్యారు.
అభ్యంతరాలు...
కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణపై సమావేశంలో చర్చించారు. నిర్దేశిత గడువులను గెజిట్లోనే పేర్కొన్నందున అందుకు అనుగుణంగా ప్రాజెక్టులు, స్వరూపం, తదితర సమాచారం, వివరాలు ఇవ్వాలని ఏపీకి బోర్డులు సూచించాయి. నోటిఫికేషన్లో చేర్చిన కొన్ని ప్రాజెక్టులు, అంశాలపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ సమావేశంలో తెలిపింది. తమకున్న అభ్యంతరాలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్తోందని ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి చెప్పారు.
కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం...
వివరాలు ఇచ్చి అభ్యంతరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని ఏపీకి బోర్డులు సూచించాయి. అన్ని అంశాలను నివేదించి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం నడుచుకుంటామని ఆయన తెలిపారు. బోర్డులపై ఎక్కువ భారం అవసరం లేదని, సాధారణ అంశాల్లో బోర్డుల జోక్యం అవసరం లేదని నారాయణరెడ్డి అన్నారు. క్లిష్టమైన అంశాలను మాత్రమే బోర్డులు చూడడం మేలని వ్యాఖ్యానించారు. రాష్ట్రం లేవనెత్తే అభ్యంతరాలపై కేంద్రం నుంచి సానుకూల స్పందన వస్తుందన్న ఆశాభావాన్ని ఈఎన్సీ వ్యక్తం చేశారు. తెలంగాణ వాళ్లు సమావేశానికి ఎందుకు హాజరుకాలేదో తెలియదని... తాము మాత్రం క్రమశిక్షణ కలిగిన వారిగా నిబంధనలు, నియమాలను గౌరవిస్తామని అన్నారు.
ఇక తరచూ...
గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణ కోసం సమన్వయ కమిటీ సమావేశాలు ఇక నుంచి తరచూ జరుగుతాయని బోర్డులు తెలిపాయి. మొదటి సమన్వయ కమిటీ సమావేశ వివరాలను కేంద్ర జలశక్తి శాఖకు నివేదిస్తామని పేర్కొన్నాయి. రెండో వారం ప్రాంతంలో పూర్తి బోర్డు సమావేశాన్ని కూడా నిర్వహించే యోచనలో ఉన్నట్లు జీఆర్ఎంబీ సభ్య కార్యదర్శి పాండే సమావేశంలో అన్నట్లు తెలిసింది.
ఇదీచూడండి: GRMB MEETING: ముందు కృష్ణా బోర్డు సంగతి తేల్చండి: తెలంగాణ