Rising temperatures in Telangana: తెలంగాణలో పగటిపూట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. రేపటి నుంచి 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలోకి క్రింది స్థాయిలో గాలులు ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్నాయని తెలిపింది. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని పేర్కొంది.
భయపెడుతున్న ఎండ: రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతోంది. ఉదయం నుంచే వేడి తీవ్రత కనిపిస్తోంది. మధ్యాహ్నానికి ఎండ తీవ్రత తారాస్థాయికి చేరుతోంది. కాక పుట్టించే సూర్యకిరణాలు తమ ప్రభావాన్ని చూపుతున్నాయి. ఏప్రిల్ మాసం ఆరంభం నుంచే ఎండ తీవ్రత పెరుగుతూ వస్తుంది. ఈసారి మరింత ఎండలు కాసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని 15 జిల్లాల్లో పగటి పూట ఉష్ణోగ్రతలే 41 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న పగటిపూట ఉష్ణోగ్రతలతో... ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. వరంగల్, హనుమకొండ జిల్లాలో రెండ్రోలుగా పెరిగిన ఉష్ణోగ్రతలకు మహిళలు, వృద్ధులు, కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10 గంటల లోపే పనులు పూర్తి చేసుకుని ఎవరి ఇళ్లలోకి వారు చేరుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరో రెండు రోజుల్లో 2 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
వివిధ జిల్లాల్లో ఇలా: గరిష్ఠంగా నిర్మల్ జిల్లా దస్తూరాబాద్‌లో 42.8 డిగ్రీలు ఎండ కాసింది. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో 42.7, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో 42.5, సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్, జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లలో 42.4, జగిత్యాల జిల్లా మల్లాపూర్, మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌లలో 42.2, పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం తక్కళ్లపల్లి, నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం లక్మాపూర్, వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం కేతేపల్లిలలో 42.1, రాజన్నసిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం మార్తాన్‌పేట, జగిత్యాల జిల్లా వెల్గటూర్‌లలో 41.9 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో గరిష్ఠంగా సైదాబాద్ మండలం అస్లాంగఢ్‌లో 37.7 డిగ్రీల సెల్సియస్ నమోదయింది.
అప్రమత్తంగా ఉండాలి: తెలంగాణలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలపై ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేస్తోంది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం గురించి తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రణాళిక సంస్థ అప్రమత్తత ప్రకటించింది. సోమవారం విడుదల చేసిన ఉష్ణోగ్రతల బులెటిన్‌లో ఆరెంజ్ రంగు సూచికను టీఎస్‌డీపీఎస్ విడుదల చేసింది.
నేడు.. రేపు ఉష్ణోగ్రతలు ఇలా: ప్రస్తుతం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న వేళ మంగళ, బుధవారాల్లో సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణశాఖ తెలిపింది.

ఇవీ చదవండి: