రాష్ట్రంలో వానాకాలం పంట సీజన్ ప్రారంభమైన దృష్ట్యా విత్తన సరఫరాకు పక్కా ప్రణాళిక రూపొందించామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని నాంపల్లి రెడ్‌హిల్స్ ఉద్యానవన శిక్షణా కేంద్రంలో వానాకాలం సీజన్ విత్తనాల సరఫరాపై మంత్రి సమీక్షించారు. రాష్ట్రంలో నియంత్రిత పంట సాగు విధానం, సరిపడా రాయితీ విత్తనాల సరఫరా, పత్తి విత్తనాల లభ్యతపై విస్తృతంగా చర్చించారు. విత్తనాల సరఫరా.. వేగంగా జరగాలని మంత్రి సూచించారు.
వర్షం పడితే రైతులు పంటలు వేయడానికి పరుగులు పెడతారని.. అందువల్ల అన్నదాతల సౌకర్యార్థం ముందుగానే నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలని తెలిపారు. పంటల వారీగా విత్తనాలు ఎక్కడెక్కడ అందుబాటులో ఉంచిందీ క్లస్టర్ల వారీగా ప్రతి రోజూ వివరాలు నమోదు చేయాలని సూచించారు. ప్రధాన విత్తన కంపెనీలతో చర్చిస్తూ.. ప్రతి రోజూ సమాచారం సేకరించాలని చెప్పారు. సన్నని వరి రకాల్లో తెలంగాణ సోనా సాగును ప్రోత్సహించాలని సూచించారు. మధుమేహం రోగులకు తెలంగాణ సోనా మేలు చేస్తుందని నిర్థారించినందున.. ప్రభుత్వం సోనా సాగును ప్రోత్సహిస్తోందని వివరించారు.
భారీస్థాయిలో సాగు చేసేలా రైతులను చైతన్యపరచడమే కాకుండా.. ఈ వానాకాలంలో 4 లక్షల క్వింటాళ్ల విత్తనాల ఉత్పత్తి కోసం తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ సన్నాహాలు చేస్తోందని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, డైరెక్టర్ కేశవులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : 'పవర్‌తో పెట్టుకున్నోళ్లు పవర్ లేకుండా పోయారు'